Trainee IAS Puja Khedkar : ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుల నుంచి వివాదాస్పద మాజీ ప్రొబేషనరీ సివిల్ సర్వెంట్ పూజా ఖేడ్కర్‌ను తక్షణమే డిశ్చార్జ్ చేస్తున్నట్లు కేంద్రప్రభుత్వం తెలిపింది. IAS ఎంపికలో భాగంగా ఓబీసీ, వికలాంగుల కోటా ప్రయోజనాలను తప్పుడు పత్రాలు సమర్పించి మోసపూరితంగా పొందినట్లు పూజా ఖేడ్కర్‌పై ఆరోపణలున్నాయి.
ఐఏఎస్ ప్రొబేషన్ రూల్స్‌లోని 12వ నిబంధన ప్రకారం ఆమెను తొలగించినట్లు కేంద్ర వర్గాలు పేర్కొన్నాయి. ప్రొబేషనర్‌లు మళ్లీ నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోయినా, లేదా ప్రొబేషనరీలో ఉన్నప్పుడు ఐఏఎస్ సర్వీసుకు అనర్హుడుగా తేలినా, ఆ వ్యక్తిని సర్వీసు నుంచి కేంద్రం డిశ్చార్జ్ చేసే అవకాశాన్ని రూల్ 12 కల్పిస్తుంది. కాగా జూలై 31న పూజా ఖేడ్కర్ అభ్యర్థిత్వాన్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రద్దు చేసింది. మళ్లీ భవిష్యత్‌లో పరీక్షలు రాయకుండా డిబార్ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా ఆమెను ఐఏఎస్ సర్వీస్ నుంచి డిశ్చార్జ్ చేస్తున్నట్లు ప్రకటించింది.