BSP Leader Murdered In Chennai : తమిళనాడు బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసులో చెన్నై పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నిందితులను విచారిస్తున్నామని, ఆ తర్వాతే వివరాలను వెల్లడిస్తామని చెన్నై నార్త్ అడిషనల్ కమిషనర్ అస్రా గార్గ్ తెలిపారు. మొత్తంగా 10 పోలీసు బృందాలు ఈ కేసుపై పని చేస్తున్నాయని అన్నారు. ఈ ఘటనపై తమిళనాడు సీఎం ఎమ్కే స్టాలిన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఎక్స్ ద్వారా స్పందించారు. నిందితులను పోలీసులు రాత్రికి రాత్రే అరెస్టు చేశారని పేర్కొన్నారు. త్వరితగతిన దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు
పెరంబూర్‌లో ఆర్మ్‌స్ట్రాంగ్ శుక్రవారం రాత్రి ఇంటి ముందు నిలుచుని ఉన్నప్పుడు ఆరుగురు వ్యక్తులు వచ్చి కత్తితో దాడి చేసి పారిపోయారు. స్థానికులు వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆర్మ్‌స్ట్రాంగ్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.