ఎమ్మెల్యే గోపిరెడ్డికి అసమ్మతి సెగ - గజ్జల బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నేతల భేటీ - Narasaraopet
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 1, 2024, 9:50 AM IST
YSRCP Leaders Meeting Against MLA Gopireddy Srinivasareddy: పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా సొంతపార్టీలోని అసమ్మతి వర్గం నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నరసరావుపేటలోని వెంగళరెడ్డి కాలనీలోని ఆరవ వార్డులో ఈ సమావేశం నిర్వహించారు. గజ్జల బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. సమావేశంలో అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తానని, నాతో అందరూ కలిసి నడవాలని గజ్జల బ్రహ్మారెడ్డి కోరినట్లు సమాచారం. మీ వెంటే మేము కలిసి నడుస్తామని పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు గజ్జల బ్రహ్మారెడ్డికి చెప్పినట్లు తెలిసింది.
ఎమ్మెల్యే గోపిరెడ్డికి సీటు ఇవ్వొద్దంటూ గజ్జల బ్రహ్మారెడ్డి వర్గం ఇటీవల తాడేపల్లిలోని సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ఆ సమయంలో విజయసాయిరెడ్డి వారికి నచ్చజెప్పడంతో వెనుదిరిగారు. అప్పటి నుంచి ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఉన్న నేతలు, కార్యకర్తలతో బ్రహ్మారెడ్డి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే సీటు ఇంకా ఎవరికీ ఖరారు కాకపోవడంతో వైసీపీ అసంతృప్తి నేతల సమావేశం పట్టణంలో చర్చనీయాంశమైంది.