కోడ్ ఉల్లంఘిస్తూ శ్రీశైలం ఆలయం వద్ద ఎన్నికల ప్రచారం - అడ్డుకున్న అధికారులతో శిల్పా చక్రపాణి రెడ్డి వాగ్వాదం - campaigning in srisailam temple
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 21, 2024, 6:11 PM IST
YCP MLA Candidate Election Campaigning in Srisailam Temple : ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో వైసీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించడం వివాదంగా మారింది. ఉదయం ఆలయం సమీపంలోని మహిషాసుర మర్దిని వద్ద ప్రచార రథానికి పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రధాన ఆలయం వెనకవైపున ఉన్న శ్రీగిరి కాలనీ, ఎస్సీ కాలనీల్లో ప్రచారం నిర్వహిస్తుండగా విషయం తెలుసుకున్న పోలీసు, రెవెన్యూ అధికారులు శిల్పా చక్రపాణి రెడ్డి ప్రచారాన్ని అడ్డుకున్నారు. శ్రీశైల పుణ్యక్షేత్రంలో పార్టీ గుర్తులు, నేతల ఫోటోలు కలిగిన ప్రచార వాహనం ద్వారా ఎన్నికల ప్రచారం చేయడం పట్ల ఫిర్యాదులు వచ్చాయని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
ఆలయ పరిసరాల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు నిర్వహించరాదని గుర్తు చేశారు. కాదని ప్రచారం చేస్తే వాహనం సీజ్ చేస్తామని హెచ్చరించారు. దీంతో కోపోద్రికుడైన ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అధికారులపై దురుసుగా ప్రవర్తించారు. మీరు ఏం కేసు పెట్టుకుంటారో పెట్టుకోండి, మేమైతే ప్రచారం ఆపము అని అధికారులను దబాయించారు. తన ప్రచారాన్ని ఆడుకోవడానికి కారణాలు తెలుపుతూ లేఖ రాసివ్వాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అధికారులు వెలుతిరిగి అక్కడ నుంచి వెళ్లిపోయారు. అనంతరం శిల్పా చక్రపాణి రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని శ్రీశైల వీధుల్లో కొనసాగిస్తూ ముందుకు వెళ్లారు. హిందూ ధార్మిక సంఘాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.