RGV Released A Video About Case : ఏపీ పోలీసుల గాలింపు వ్యవహారంలో రాంగోపాల్ వర్మ ఓ వీడియో విడుదల చేశారు. కేసులకు తానేం భయపడడం లేదని ఈ వీడియోలో తెలిపారు. తాను ట్వీట్స్ పెట్టిన వారికి కాకుండా సంబంధం లేని వారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు. ప్రస్తుతం ఓ చిత్రం చిత్రీకరణలో ఉన్నానని నిర్మాతకు నష్టం వస్తుందనే విచారణకు రాలేకపోతున్నానని తెలిపారు.
Police Searching For Ram Gopal Varma : నేతల పోలికలతో ఉన్న నటులతో ఓ పార్టీకి అనుకూలంగా చిత్రాలు తీసి వాటి ప్రమోషన్ కోసం అప్పటి విపక్ష నేతలైన చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌లపై నోరు ఆర్జీవీ పారేసుకున్నారు. వ్యక్తిగత దూషణలు, మార్ఫింగ్ ఫొటోలతో చిక్కులు తెచ్చుకున్నారు. వర్మ 1997లో 'దౌడ్' పేరుతో ఓ సినిమా తెరకెక్కించారు. ఇప్పుడు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఆయనే పరుగులు తీస్తున్నారు. సామాజిక మాధ్యమాలు, టీవీ షోలలో ఇష్టారీతిన రెచ్చిపోయే ఆయన ఉన్నట్టుండి అజ్ఞాతంలోకి వెళ్లారు.
బెడిసి కొట్టిన 'వ్యూహం' - అజ్ఞాతంలో ఆర్జీవీ
అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నెల రోజుల క్రితం మద్దిపాడు పోలీసు స్టేషన్‌లో వర్మపై కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ ఒంగోలు గ్రామీణ పోలీసులు మొదటిసారి హైదరాబాద్‌లో ఆయన కార్యాలయంలో నోటీసులు అందజేశారు. ఆ మేరకు ఈ నెల 19న ఒంగోలు గ్రామీణ సీఐ శ్రీకాంత్‌బాబు ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉండగా హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. కోర్టు తిరస్కరణతో వారం రోజులు సమయం ఇవ్వాలని దర్యాప్తు అధికారికి వర్మ వాట్సాప్ ద్వారా సందేశం పంపారు. ఈ నెల 25న విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు మరోసారు నోటీసులు పంపారు. దానికీ ఆయన హాజరు కాకపోగా పోలీసుల నుంచి తప్పించుకుంటున్నట్లు సమాచారం.