నివాసాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు - ఆందోళన చేపట్టిన స్థానికులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : 2 hours ago
WOMENS PROTEST in Vijaywada : నివాస ప్రాంతాల్లో మద్యం దుకాణాలను ఏర్పాటు చేయొద్దని విజయవాడలోని దేవీనగర్ కు చెందిన కాలనీవాసులు, రెసిడెన్షియల్ అసోసియేషన్, మహిళా సంఘాలు ఆందోళన చేపట్టారు.
విజయవాడలోని దేవీనగర్ ఎనిమిదో లైన్లో ట్రెండ్ సెట్ అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్న ప్రాంతంలో మద్యం దుకాణాన్ని పెట్టేందుకు నిర్మాణం చేపట్టారు. జనావాసం అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో మద్యం దుకాణాలను నిర్వహిస్తే మహిళలు, చిన్న పిల్లలు ఎలా బయటకు రావాలని కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు. ఇళ్ల మధ్యలో మద్యం దుకాణాలను నిర్మిస్తుంటే అధికారులు లైసెన్సులు ఎలా ఇచ్చారని వారు ప్రశ్నించారు.
రాత్రి అయితే చాలు వివిధ ప్రాంతాల నుంచి గంజాయి, మద్యం సేవించిన వారు తమ కాలనీల్లో తిరుగుతున్నారని బయటికి రావాలంటేనే భయపడుతున్నామని, అలాంటిది మద్యం దుకాణాన్ని తమ కాలనీలోనే ఏర్పాటు చేస్తే తమకు రక్షణ ఉండదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ కాలనీలో మద్యం దుకాణం ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.