సమస్య పరిష్కరించిన నేతకు జనం జేజేలు - ఎమ్మెల్యే చెవిరెడ్డి అనుచరులకు షాక్
🎬 Watch Now: Feature Video
Villagers' Anger Against YCP Leaders : చంద్రగిరి మండలం రాయలపురం పంచాయతీ వెంకటంపేటలో ఏళ్ల తరబడి వేధిస్తున్న మురుగు నీటి కాల్వ సమస్యకు పరిష్కారం లభించింది. మురుగు నీరు, తాగునీటితో కలుషితమై స్థానిక పిల్లలు జ్వరాలు, కిడ్నీ సమస్యలతో బాధలు పడుతున్నారు. కొంత కాలంగా ఇద్దరు మృత్యువాత పడగా, మరో ముగ్గురు డయాలసిస్ చేసుకుంటున్నారు. సమస్య పరిష్కారం కోసం గ్రామస్తులు స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రభుత్వ ఉన్నతాధికారులకు చాలా సార్లు విన్నవించుకున్నారు. కానీ వారు చేసిన ప్రయత్నాలు ఫలితం లేకుండా పోయింది. దీంతో గ్రామస్థులు రాష్ట్ర ఓబీసీ ఫోరం కన్వీనర్ బడి సుధాయాదవ్ ను కలిసి సమస్యను వివరించారు. గత వారం నుంచి ఆయన చేసిన పోరాటానికి స్పందించిన అధికారులు, ప్రజాప్రతినిధులు మురుగు కాలువ సమస్యకు రూ.40 లక్షల నిధులు మంజూరు చేయటంతో పాటు భూమి పూజ కూడా చేశారు.
కాగా, స్థానిక ప్రజలకు కానీ మీడియాకు కానీ సమాచారం ఇవ్వకుండా భూమి పూజ కార్యక్రమాన్ని గోప్యంగా నిర్వహించారు. దీంతో గ్రామస్థులు బడి సుధాయాదవ్ వల్ల ఈ కాలువ సమస్యకు పరిష్కారం లభించిందని అందుకు బడి సుధా యాదవ్ కు సన్మాన కార్యక్రమం పెట్టుకున్నారు. సన్మానం జరుగుతుండగా స్థానిక వైసీపీ సర్పంచ్, పార్టీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మా ఎమ్మెల్యే చొరవతోనే కాలువ సమస్య పరిష్కారం అయిందన్నారు. మీ అందరికీ పెళ్లి కానుకలు, స్వీట్స్, చీరలు, వాచీలు కూడా ఇస్తున్నారని చెప్పారు. దీంతో మండిపడిన గ్రామస్థులు ఎమ్మెల్యే కానుకలు మేము అడిగామా అని నాయకులను నిలదీశారు. కాలువ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, కలెక్టర్, ఆర్డీవో, ఎంపీడీవో, పంచాయతీ సెక్రటరీకి ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ స్పందించలేదని మండిపడ్డారు. బడి సుధాయాదవ్ పోరాట ఫలితంగా అధికారుల్లో చలనం వచ్చిందన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న చంద్రగిరి పోలీసులు ఇరువర్గాలను శాంతింప చేయటంతో గొడవ సద్దుమణిగింది.