బ్యాంకులో ఇంటి దొంగలు- తాకట్టులో ఉన్న ఆభరణాలు మాయం - Bank Staff Stealing Gold Ornaments
🎬 Watch Now: Feature Video
Union Bank Staff Stealing Gold Ornaments : బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారు నగలను యూనియన్ బ్యాంక్ సిబ్బందే మాయం చేసిన ఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలో ఆలస్యంగా వెలుగు చూసింది. మేనేజర్ లేని సమయంలో కొంతమంది బ్యాంక్ సిబ్బంది బంగారు ఆభరణాలను చోరీ చేసినట్లు తెలుస్తోంది. సుమారు 9 మంది ఖాతాదారులకు చెందిన 2 వందల గ్రాముల బంగారు నగలు అదృశ్యమైనట్లు బ్యాంకు అధికారులు నిర్ధారించారు. వీటి విలువ 15 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు.
ఇటీవల ఓ ఖాతాదారుడు బ్యాంకు నుంచి తీసుకున్న రుణం చెల్లించి తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు వెనక్కి తీసుకోవడానికి రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ సిబ్బంది వెనక్కి ఇచ్చిన నగల్లో ఒక బంగారు గాజు తగ్గడంతో వెంటనే బ్యాంక్ మేనేజర్‌కి ఫిర్యాదు చేశాడు. అప్రమత్తమైన బ్యాంకు మేనేజర్ యూనియన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయ అధికారులకు నివేదించారు. దీంతో వారు వెంటనే ఓ బృందాన్ని కనిగిరి యూనియన్ బ్యాంక్‌కు పంపించారు. ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన వారు బ్యాంకులో ఉన్న బంగారు ఆభరణాలను లెక్కించారు. అంతర్గత విచారణ చేయగా ఇటీవల బ్యాంకు మేనేజర్, డిప్యూటీ మేనేజర్ సెలవుపై వెళ్ళిన సమయంలో కొందరు సిబ్బంది సీసీ కెమెరాలు నిలిపేసి లాకర్లను తెరిచినట్లు వెల్లడైంది. బ్యాంక్ మేనేజర్ వెంకట్రావు సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.