సెంట్రల్ జైలులో గిరిజన ఖైదీ అనుమానాస్పద మృతి - న్యాయం చేయాలంటూ బాధితుల డిమాండ్ - Tribal Prisoner Died Central Jail
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 8, 2024, 7:00 PM IST
Tribal Prisoner Died Suspiciously in Visakhapatnam Central Jail : విశాఖ సెంట్రల్ జైలులో ఓ గిరిజన ఖైదీ అనుమానాస్పదంగా మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులే కొట్టి చంపారంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాల్సిందేనంటూ కేజీహెచ్ మార్చురీ ఎదుట బాధితుడి కుటుంబం ఆందోళనకు దిగారు. మరో మూడు రోజుల్లో బెయిల్పై విడుదల కావాల్సిన వ్యక్తి మృతి చెందడం వల్ల తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
గత సంవత్సరం జూలై 23న కోడ పోత్తన్న (45) గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నాడనే అనుమానంతో పోలీసులు కేసును నమోదు చేశారని విశాఖ ఆర్డీవోకి ఇచ్చిన లేఖలో కోడ తులమ్మ పేర్కొంది. అనంతరం అతని కోర్టులో హజరుపరచగా మేజిస్ట్రేట్ 6 నెలలు రిమాండ్కు పంపించారని తెలిపారు. ఈ నెల 6న (ఫిబ్రవరి 6న) జైల్ అధికారులు ఫోన్ చేసి తన భర్తకు ఆరోగ్యం బాగాలేదని ఆమె తమ్ముడికి తెలిపినట్లు వివరించారు. కొద్ది సమయం అనంతరం ఫోన్ చేసి ఆమె భర్త చనిపోయారని తెలిపినట్లు పేర్కొన్నారు. పోత్తన్న శరీరంపై గాయాలు, ముఖం వాచినట్లు ఉండటం వల్ల పలు అనుమానాలకు తావిస్తోందని వివరించారు. ఈ విషయంపై న్యాయ విచారణ జరిపించి, తమకు న్యాయం చేయాలని ఆర్డీవోను బాధితులు కోరుకున్నారు. లేకుంటే కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు.