రైతు సమస్యలపై చలించిన ఎమ్మెల్యే- ధాన్యాన్ని స్వేచ్ఛగా అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తామని హామీ - UNSEASONAL RAINS
🎬 Watch Now: Feature Video
Nimmala RamaNaidu On YSRCP Government : వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోడానికి రైతులు నానాపాట్లు పడాల్సి వస్తోందని పాలకొల్లు ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం సరిపల్లిలో పర్యటించిన ఆయన అకాల వర్షం కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
రహదారులు, పొలం గట్లపై ఉన్న ధాన్యం రాశులను చూసి చలించిపోయిన నిమ్మల రామానాయుడు రైతుల కష్టంలో పాలుపంచుకున్నారు. స్వయంగా ధాన్యాన్ని సంచుల్లో నింపి, తూకం వేసి, ట్రాక్టర్కు ఎత్తారు. ధాన్యం కోతలు కోసి పది రోజులైనా ప్రభుత్వం సంచులు సరఫరా చేయలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని కారణంగానే అకాల వర్షంతో ధాన్యం తడిసిపోయిందని ఆయన తెలిపారు. ఆన్లైన్ విధానంలో ధాన్యం రైసు మిల్లులకు తరలించడంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు వివరించారు. మరికొన్ని రోజుల్లో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రానుందని, రైతులు పండించిన ధాన్యాన్ని స్వేచ్ఛగా అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తామని నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారు