ఎగసిపడుతున్న అలలు - బిక్కుబిక్కుమంటున్న తీర ప్రాంత ప్రజలు - SEAS TURBULENT IN AP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 17, 2024, 5:03 PM IST
Sea Become Turbulent in Konaseema And Kakinada District : వాయుగుండం ప్రభావంతో కోనసీమ, కాకినాడ జిల్లాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. రాత్రి నుంచి తీరం వెంబడి ఉవ్వెత్తున అలలు ఎగసి పడ్డాయి. తీరం వెంబడి సముద్రం సుమారు అర కిలోమీటరు మేర చొచ్చుకొచ్చింది. సఖినేటిపల్లి మండలం అంతర్వేది, గోదావరి సంగమం, బీచ్ రోడ్డులో అలల ఉద్ధృతి ఎక్కువగా ఉంది. పల్లెపాలెంలోని ఇళ్లల్లోకి నీరు చేరింది. మలికిపురం మండలంలోని పలు గ్రామాల్లోకి కూడా ఉప్పునీరు చేరింది. తీరంలోని ఆక్వా చెరువులు నీట మునిగాయి. మామిడికుదురు మండలం కరవాక తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. అల్లవరం మండలం ఓడలరేవులో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ONGC టెర్మినల్‌ను సముద్రపు నీరు ముంచేయగా టెర్మినెల్ గోడ కోతకు గురైంది.
వాహన రాకపోకలకు, చమురు, సహజ వాయువు కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. ఆక్వా చెరువులు కొట్టుకుపోయాయి. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలోనూ సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు, గృహాలు నేలకూలాయి. ఉప్పాడ, సుబ్బంపేట, మాయాపట్నం, జగ్గరాజుపేట గ్రామాలపై కెరటాల తాకిడి తీవ్రంగా ఉంది. రోడ్లు కోతకు గురైంది. గృహాలు కోల్పోయిన బాధితులు సామాగ్రితో మెరక ప్రాంతాలకు చేరుకుంటున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని ఆహారం లేక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని బాధితులు వాపోతున్నారు.