పేద విద్యార్థుల కోసం ఆర్డీటీ ప్రవేశ పరీక్ష - రెండు రాష్ట్రాల నుంచి 4,600 మంది హాజరు - Conduct in RDT Entrance Exam
🎬 Watch Now: Feature Video
RDT Conduct in Entrance Exam: ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు కార్పొరేట్ విద్యాలయాల్లో ప్రవేశం కల్పించేందుకు ఆర్డీటీ ప్రవేశ పరీక్షను నిర్వహించింది. దీనిలో భాగంగా అనంతపురం జిల్లా ఉరవకొండలోని జూనియర్ కళాశాలలో కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రంలో పది మండలాలకు చెందిన విద్యార్థులు పరీక్ష రాశారు. దానికి వారి నుంచి మంచి స్పందన లభించింది. ఈ కేంద్రంలో 322 మంది విద్యార్థులకు గానూ 318 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. దీంతో పరీక్ష కేంద్రం విద్యార్థులతో రద్దీగా కనిపించింది.
ఆయా మండలాల్లోని గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులు ఉదయమే పరీక్ష కేంద్రానికి తల్లిదండ్రులతో కలిసి చేరుకున్నారు. పరీక్షను ఆర్డీటీ, ఆర్డీ కృష్ణారెడ్డి, ఎటీఎల్ నల్లప్పరెడ్డి పర్యవేక్షించారు. ఏటా పేద విద్యార్థుల కోసం పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఆర్డీటీ ఆధ్వర్యంలో 10 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 4,600 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. ఆర్డీటీ వ్యవస్థాపకులు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ 2004లో ప్రవేశపెట్టిన ఈ పథకం కింద ఏటా విద్యార్థుల సంఖ్యను పెంచుతూ వస్తున్నారు. పథకం అమలు చేసిన కొత్తలో విద్యార్థి కుటుంబ ఆర్థికస్థితి, పదో తరగతిలో సాధించిన మార్కులను ప్రామాణికంగా తీసుకుని ఎంపిక చేసేవారు.