తాగునీటి కోసం రోడ్డెక్కిన గ్రామస్థులు - ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవట్లేదని ఆగ్రహం - Protest for Drinking Water
🎬 Watch Now: Feature Video
Protest for Drinking Water in Koppolu Village: తాగునీటి కోసం ప్రకాశం జిల్లా ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని కొప్పోలు గ్రామస్థులు రోడ్డెక్కారు. కొన్ని రోజులుగా నీటి సరఫరా సక్రమంగా లేదని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోడు వినాలంటూ చిన్నారులు, మహిళలు సైతం ఖాళీ బిందెలు పట్టుకుని రోడ్డును నిర్బంధించారు. వారానికోసారి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే నీరు ఏమాత్రం సరిపోవట్లేదంటూ నగరపాలక సంస్థ అధికారులతో వాగ్వాదానికి దిగారు. నీళ్లు సరిగ్గా రాకపోవడంతో కొంతమంది ట్యాంకర్ల ద్వారా తెప్పించుకొని పోయించుకుంటున్నారని తెలిపారు.
వారానికి ఒక్కసారి కూడా కార్పొరేషన్ అధికారులు నీళ్లు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అసలే ఎండాకాలం కావడంతో తాగు నీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. ఒక్కొక్కసారి డబ్బులు ఇచ్చి వాటర్ కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి వస్తుందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తక్షణమే తాగేందుకు నీరు సరఫరా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.