ఆ పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు బంపరాఫర్ - రెండేసి ఓట్లు!
🎬 Watch Now: Feature Video
Mistakes in Voter List: రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరపడుతున్నప్పటికీ ఓటర్ల జాబితాలో చిత్రవిచిత్రాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఎన్నికల సంఘం తుది జాబితా ప్రకటించినా తప్పులు కనిపిస్తున్నాయి. డబుల్ ఓట్లు, మృతుల పేర్లు, స్థానికేతరులకు ఓట్లు ఇలాంటి అవకతవకలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.
ఓటరు జాబితాను పరిశీలించే కొద్దీ జాబితాలో అక్రమాలు, పొరపాట్లు వెలుగు చూస్తున్నాయి. వాటిని చూస్తున్న జనం ఇదేం పారదర్శకత అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలోని పోలింగ్ కేంద్రం 116లో మొత్తం 843 మంది ఓటర్లు ఉన్నారు. అయితే వారిలో కొందరికి రెండేసి చొప్పున బోగస్ ఓట్లను కల్పించారు. తుది ఓటర్ల జాబితా రూపకల్పనలో ఎన్నికల అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తోందని స్థానికుల నుంచి విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే ఈ సమస్య కేవలం ఒక ప్రాంతానిది మాత్రమే కాదు. తుది జాబితా ప్రకటించిన తరువాత సైతం రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున తప్పులు వెలుగుచూశాయి. దీనిపై ఇప్పటికే ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.