తుని హైవేపై బస్సు-లారీ ఢీ - సీసీ టీవీలో దృశ్యాలు - తుని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 15, 2024, 5:52 PM IST
Lorry Bus Collision at Tuni National Highway: కాకినాడ జిల్లా తుని జాతీయ రహదారిపై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 23మంది గాయపడగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. బస్ మలుపు తిరుగుతుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని బస్సు డ్రైవర్ పేర్కొన్నారు.
బస్సు డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఉదయం 11.30 గంటలకు రాజమహేంద్రవరం నుంచి తుని వెళ్తున్న బస్సులో మొత్తం 45 మంది ప్రయాణిస్తున్నారు. వెలమకొత్తూరు కూడలి (junction)లో బస్సు మలుపు తిరిగి తుని వైపు వెళ్తుండగా హైవేపై వేగంగా ఇనుప లోడుతో వస్తున్న లారీ బస్సు మధ్య భాగాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు అడ్డం తిరిగి డివైడర్ మీదికి ఎక్కింది. ఈ క్రమంలో బస్సులో ఉన్న ప్రయాణికులు, లారీ డ్రైవర్, ద్విచక్ర వాహనాదారుడితో సహా 23 మంది గాయపడ్డారు. వారిలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108కు సమాచారం ఇవ్వటంతో క్షతగాత్రులను తుని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చేరిన గర్భిణీ చిన్నారిని ప్రసవించింది. స్వల్ప గాయాలతో బయటపడిన వారు చికిత్స తీసుకుని ఇంటికి చేరుకున్నారు.