ఈ చెరువు నాది- నీవు తవ్వుకోవడానికి వీల్లేదు! మట్టి అక్రమ తవ్వకాల్లో అధికార నేతల మధ్య బాహాబాహీలు
🎬 Watch Now: Feature Video
Illegal Mining of Soil Stopped in Tirupati District : మట్టి అక్రమ తవ్వకాలు ఇద్దరు నేతల మధ్య గొడవలకు దారితీసింది. అధికార వైసీపీ నేతలు రెండు వర్గాలుగా మారి కొట్టుకోవడం వల్ల తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం బంగారం పేట గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ చెరువులు, ప్రభుత్వ భూముల్లో విచ్చలవిడిగా తవ్వకాలు జరుగుతుండటంతో స్థానికులతో కలిసి వైసీపీ నేత కళత్తూరు శేఖర్ రెడ్డి అడ్డుకున్నారు. ఆయనపై ఎన్డీసీసీబీ (NDCCB)ఛైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి బాహాబాహీకి దిగారు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని శేఖర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
బంగారంపేట చెరువులో కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. ఈ క్రమంలో స్థానికులు రెండు రోజులుగా అడ్డుకుంటున్నారు. ఈ విషయాన్ని స్థానికులు శేఖర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. అందుకు ఆయన స్పందించి అక్రమ తవ్వకాలు చేపట్టవద్దని శేఖర్ రెడ్డి సత్యనారాయణ రెడ్డికి బుధవారం ఫోన్లో తెలిపారు. ఆయన ససేమిరా అనడంతో గురువారం రాత్రి తవ్వకాలు జరుగుతున్న ప్రాంతంలో స్థానికులతో కలిసి లారీలు ఆపారు. దీంతో ఇరు నాయకులు మధ్య గొడవ చోటుచేసుకుంది.