బాలల రక్షణ కోసం కఠిన శిక్షలు అమలు చేయాలి: జస్టిస్ ధీరజ్ సింగ్ - High Court CJ on Child Attacks

🎬 Watch Now: Feature Video

thumbnail

AP HC Chief Justice Dhiraj Singh Thakur on Child Attacks: దేశవ్యాప్తంగా బాలల మీద నేరాలు పెరగడం ఆందోళనకరమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారుల భద్రత, హక్కుల రక్షణ అత్యంత ముఖ్యమని జస్టిస్ ధీరజ్‌ సింగ్ ఠాకూర్ అన్నారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లల విషయంలో మరింత జాగ్రత్త అవసరమన్నారు. అలాంటి పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.  

గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో బాలల హక్కుల రక్షణ అంశంపై జరిగిన రాష్ట్రస్థాయి సదస్సులో ఆయన పాల్గొన్నారు. జాతీయ నేర గణాంకాల నివేదిక ప్రకారం 2023లో 1.62 లక్షలమందిపై దాడులు జరిగాయని, 83,350 మంది బాలబాలికలు తప్పిపోయారని జస్టిస్ ధీరజ్ తెలిపారు. కనిపించకుండా పోయిన వారిలో 20,380 మంది బాలురు, 62,946 మంది బాలికలు ఉన్నారని పేర్కొన్నారు. వీరిలో 2,946 మంది బాలికల ఆచూకీ తెలియకపోవడం విచారకరమన్నారు. 

శిక్షలు వేస్తున్నా నేరాలు తగ్గడం లేదు: ఏటా బాలబాలికల మీద నేరాలు 7 శాతానికి పైగా పెరగడం ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు.  గతేడాది 1,004 పోక్సో కేసులు నమోదు అయితే వాటిలో 900 కేసుల్లో బాధితులకు పరిచయం ఉన్న వారే నిందితులు కావడం శోచనీయమన్నారు. పోక్సో లాంటి ప్రత్యేక చట్టాలు తెచ్చి నిందితులకు శిక్షలు వేస్తున్నా నేరాలు తగ్గడం లేదన్నారు. బాలల రక్షణ, భద్రత కోసం కఠిన శిక్షలు అమలు చేయాల్సిన అవసరం ఉందని జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ జి. నరేంద్ర, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. 

జస్టిస్ జి.నరేంద్ర: ఈ స్థాయిలో నేరాలు పెరగడం ఆందోళనకరమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.నరేంద్ర అన్నారు. ప్రత్యేక అవసరాలున్న బాల, బాలికల భద్రత, హక్కుల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రత్యేక అవసరాలున్న బాలల హక్కుల గురించి ఒక్కరోజుకే పరిమితం కాకుండా తరచూ చర్చించుకోవాలని తెలిపారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లల హక్కుల గురించి రాష్ట్రంలోని అన్ని విభాగాల వారికి అవగాహన కల్పించాలని ఇలాంటి పిల్లల జీవితాల మెరుగుదలకు చేస్తున్న కసరత్తు నిరంతరం కొనసాగాలని జస్టిస్ నరేంద్ర అన్నారు. 

Last Updated : Aug 10, 2024, 7:22 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.