విశాఖ కంటైనర్ టెర్మినల్‌లో భారీ అగ్నిప్రమాదం - పక్కనే హీరో రజనీకాంత్ సినిమా షూటింగ్ - Fire Incident Visakha Beach Road - FIRE INCIDENT VISAKHA BEACH ROAD
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 14, 2024, 8:17 PM IST
Fire Accident In Visakha Beach Container Terminal : విశాఖపట్నం బీచ్ రోడ్డులోని కంటైనర్ టెర్మినల్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. చైనా నుంచి వచ్చిన లిథియం బ్యాటరీల లోడ్‌లో పొగలు రావడాన్ని గుర్తించిన సిబ్బంది వాటిని పరిశీలించిన సమయంలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. నల్లని దట్టమైన పొగ కూడా అలుముకుంది. ప్రమాద తీవ్రత పెరగకుండా వెనువెంటనే అంతర్గత అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై నివారణ చర్యలు ప్రారంభించారు. దాదాపు రెండు గంటల తర్వాత వాటిని పూర్తిగా నిలిపివేయగలిగారు. బయటనుంచి మరో అగ్నిమాపక యంత్రాన్ని రప్పించి మంటలను ఆర్పివేశారు.
అయితే రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘కూలీ’ సినిమా షూటింగ్ అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతంలోనే జరుగుతుంది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే టీమ్ మొత్తం అప్రమత్తమైనట్లు సమాచారం. లిథియం బ్యాటరీల లోడ్‌తో వచ్చిన కంటైనర్ షిప్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.