గుండెపోటుతో మహిళా కండక్టరు మృతి- అధికారుల వేధింపులే కారణమంటున్న కుటుంబీకులు - Died Heart AttackinFemale Conductor
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 18, 2024, 2:43 PM IST
Female Conductor Dead Heart Attack Due to Depression:గుండెపోటుతో ఆర్టీసీ మహిళా కండక్టరు మృతి చెందిన ఘటన వైఎస్సార్ జిల్లా కడపలో చోటు చేసుకుంది. కొన్నాళ్లుగా అధికారుల తీరుతో మనోవేదనకు గురై గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. యూనియన్ సిబ్బంది వివరాల ప్రకారం కడప ఆర్టీసీ డిపోలో గత 25 ఏళ్ల నుంచి కుసుమకుమారి కండక్టరుగా పని చేస్తున్నారు. ఈ నెల 5న రాజంపేట నుంచి కడపకు వస్తున్న సర్వీసులో ఆమె విధులు నిర్వహిస్తున్నారు. బస్సులో సాధారణ ప్రయాణికులు, బస్సు పాసులున్న విద్యార్థులు మొత్తం 87 మందితో కిటకిటలాడటంతో బస్సు ఎక్కిన ఇద్దరు వ్యక్తులు కండక్టరుకు రూ.40 ఇవ్వగా ఆమె ఒక్క టిక్కెట్టు మాత్రమే ఇచ్చారు.
ఈ నేపథ్యంలో ఆర్టీసీ తనిఖీ అధికారులు బస్సు ఎక్కి తనిఖీ చేయగా అంతకు ముందు ఎక్కిన ఇద్దరు ప్రయాణికుల వద్ద ఒక టిక్కెట్టు మాత్రమే ఉండటంతో డబ్బులు తీసుకుని వారికి టిక్కెట్టు ఇవ్వలేదని కుసుమపై కేసు రాశారు. రద్దీలో తాను పొరపాటున ఒక టిక్కెట్టు మాత్రమే కొట్టానని అది గమనించలేదని ఆమె ఎంత చెప్పినా అధికారులు వినకుండా ఆమెను స్పేర్లో ఉంచారని పేర్కొన్నారు. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలిపారు. ఆమెను తర్వాత అధికారులు విధులకు పంపించినా తీవ్ర మనోవేదనతో బాధపడుతూ ఆదివారం గుండెపోటుతో మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలతోపాటు మానసిక స్థితి సరిగా లేని ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తనిఖీ అధికారులు అభియోగాలు మోపడం వల్లే ఈ దారుణం జరిగిందని ఆరోపించారు.