రోడ్డు దాటేందుకు ఏనుగు తంటాలు- సెల్ఫీల కోసం ఎగబడ్డ జనం - Elephant Struggles to Cross Road
🎬 Watch Now: Feature Video
Elephant Struggles to Cross Road: చిత్తూరు జిల్లాలో శనివారం రాత్రి ఓ ఏనుగు హల్చల్ సృష్టించింది. పలమనేరు నియోజకవర్గం గంటా గ్రామంలోకి చొరబడి రాత్రి సమయంలో రోడ్డు దాటేందుకు ప్రయత్నించి నానా తంటాలు పడింది. అయితే అటుగా వెళ్తున్న ప్రయాణికులు ఏనుగుతో సెల్ఫీల కోసం ఎగబడ్డారు. చిత్తూరు నుంచి పలమనేరు రూట్లో వెళ్లే వాహనాల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఏనుగు తీవ్రంగా ఇబ్బంది పడింది.
అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన గజరాజు రహదారికి దాటి అవతలి వైపు వెళ్లేందుకు ఎంతో ప్రయత్నించింది. అయితే వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో చివరికి ఏనుగు వెనుదిరిగింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కాగా గజరాజు రోడ్డుపై ఉన్నంతసేపు అటవీ అధికారులు అటువైపు రాలేదని స్థానికులు మండిపడుతున్నారు. ఆహారం కోసం ఏనుగులు సుదీర్ఘ ప్రయాణాలు చేస్తుంటాయని, అలాంటి సమయంలో కనీసం ఒకరిద్దరు ట్రాకర్స్‌ను అయినా పెట్టి ఏనుగును రోడ్డు దాటించి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమైంది.