Minister Komatireddy visits Sandhya Theater victim Sreetej: హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ ఆస్పత్రి బులిటెన్ విడుదల చేసింది. వెంటిలేటర్ సాయం లేకుండానే శ్రీతేజ్ శ్వాస తీసుకుంటున్నట్లు పేర్కొంది. బాలుడికి అప్పుడప్పుడు జ్వరం వస్తోందని, నిన్నటితో పోల్చితే శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడినట్లు కిమ్స్ వైద్యులు బులిటెన్‌లో వెల్లడించారు.
బాలుడిని పరామర్శించిన కోమటిరెడ్డి: సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి ఫౌండేషన్ తరఫున శ్రీతేజ్ తండ్రి భాస్కర్‌కు రూ.25లక్షల చెక్కు అందజేశారు. బాలుడి చికిత్స కోసం అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని, బాధిత కుటుంబం నుంచి ఒక్క పైసా కూడా తీసుకోవద్దని ఆసుపత్రి యాజమాన్యానికి తెలిపామని మంత్రి చెప్పారు.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన పట్ల ప్రభుత్వపరంగా చింతిస్తున్నామని, అందుకు క్షమాపణ చెబుతున్నామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. శ్రీతేజ్ కోలుకోవాలని కోరుకుంటున్నానని, బాలుడిని బతికించుకునేందుకు ఎంత దూరమైనా వెళ్తామని అన్నారు. అమెరికాలో మెడిసిన్ ఉన్నా తీసుకొచ్చి బతికించే ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు. తాము తప్పించుకునే వ్యక్తులం కాదని, బాధ్యత కలిగిన వ్యక్తులమని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవని, టికెట్ల రేటు పెంపుపై సమీక్షించి అనుమతి ఇస్తామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. అన్ని సినిమాలకు టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. సందేశాత్మక, దేశభక్తి, రాష్ట్ర చరిత్ర, సంస్కృతి సంబంధిత చిత్రాలకే రేట్ల పెంపునకు అనుమతిస్తామని అన్నారు.
అనుమతి తిరస్కరించిన తర్వాత కూడా హీరో థియేటర్‌కు రావటం సరికాదన్న కోమటిరెడ్డి, పోలీసులు అనుమతి ఇవ్వకపోతే రాజకీయ నేతలు కూడా సభలు రద్దు చేసుకుంటారన్నారు. పిల్లల కోరిక మేరకు తండ్రి కుటుంబంతో సహా సినిమాకు వెళ్లారని, అదేరోజు థియేటర్‌కు హీరో వచ్చారన్నారు. పోలీసుల అనుమతి లేకుండానే చిత్రబృందం థియేటర్‌కు వచ్చిందన్నారు. హీరో అనేక మంది బౌన్సర్లతో థియేటర్‌కు వచ్చారని, చూసేందుకు జనం గుమికూడగా వారిని బౌన్సర్లు తోసివేయగా, తోపులాట జరిగిందన్నారు. ఈ క్రమంలో కిందపడిన రేవతి, శ్రీతేజ్‌కు గాయాలయ్యాయన్నారు. తొక్కిసలాటలో రేవతి చనిపోగా, కుమారుడు ఆస్పత్రిలో ఉన్నారన్నారు. తొక్కిసలాట తర్వాత కూడా హీరో చేతులు ఊపుతూ వెళ్లారని కోమటిరెడ్డి తెలిపారు.
ఇకపై నో బెనిఫిట్ షోలు - టికెట్ల రేట్ల పెంపునకు అనుమతిచ్చేది లేదు: మంత్రి కోమటిరెడ్డి
'ప్రజల ప్రాణాలు పోతుంటే ఊరుకోం' - సంధ్య థియేటర్ ఘటనపై రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు