మెట్టవలసలో డయేరియా అలజడి - ఆస్పత్రిలో చేరిన 40 మంది - Diarrhea Spreads in Srikakulam - DIARRHEA SPREADS IN SRIKAKULAM
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 5, 2024, 10:53 AM IST
Diarrhea Spreads in Srikakulam District : రాష్ట్రంలో అతిసార వ్యాధి విజృంభిస్తోంది. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటి సంఘటనలు వెలుగు చూశాయి. అతిసార వ్యాధితో జి. సిగడాం మండలం మెట్టవలస గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో ఇంటికొకరు చొప్పున మంచాన పడ్డారు. విరేచనాలు, వాంతులతో సుమారు 40 మంది దాకా బాధపడుతున్నారు. బాధితులు రాజాం సామాజిక ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కలుషిత నీరు తాగడం వల్లనే గ్రామంలో అతిసారం ప్రబలిందని స్థానికులు పేర్కొన్నారు.
అతిసార వ్యాధితో వృద్ధులు, గర్భణిలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని బాధితుల కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికొకరు అతిసారంతో (Diarrhea) బాధపడుతుంటే వైద్య సిబ్బంది జాడ లేదని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులుగా బాధితుల సంఖ్య పెరుగుతున్నా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వ్యాధి నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.