దళితుల హక్కులు, సమస్యలు అన్ని పార్టీల మేనిఫెస్టోల్లో చేర్చాలి: అండ్ర మాల్యాద్రి
🎬 Watch Now: Feature Video
Dalit Declaration Meeting in Vijayawada : దళితుల హక్కులు, సమస్యలు అన్ని రాజకీయ పార్టీలు వారి మేనిఫెస్టోల్లో పొందుపరచాలని కులవివక్ష పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి డిమాండ్ చేశారు. ఈరోజు దళితుల డిక్లరేషన్‌పై విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దళితుల హక్కులను కాపాడటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ విధులను పక్కదారి పట్టించకుండా వారికే ఖర్చు చేసేలా చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టానికి తూట్లు పొడిచే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నిరుద్యోగులు ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారికి తక్షణమే ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు రిజర్వేషన్ల ప్రకారం ప్రమోషన్లు అమలు చేయాలని కోరారు. దళితుల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించి తీసుకున్న దళిత డిక్లరేషన్‌ను అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో పొందుపరచాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలు ప్రజా సంఘాలు పాల్గొన్నాయి.