విశాఖ రైల్వే జోన్ కోసం నిరసన చేసిన బీజేపీ నేతల అరెస్ట్
🎬 Watch Now: Feature Video
BJP Leaders Arrest About Visakha Railway Zone Land Protest: విశాఖ రైల్వే జోన్కు రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించకపోవడాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు విశాఖలో చేపట్టిన ఆందోళన అరెస్టులకు దారి తీసింది. కేంద్ర ప్రభుత్వం విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కేటాయించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించకపోవడం శోచనీయమని బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉచితంగా భూమి ఇవ్వమని అడగటం లేదని రైల్వే దగ్గర నుంచి జీవీఎంసీ తీసుకున్న భూమికి బదులుగా ఇవ్వవలసిన 52 ఎకరాలను రైల్వే శాఖ అడుగుతుందని బీజేపీ రాజ్యసభ ఎంపీ నరసింహారావు స్పష్టం చేశారు.
వైసీపీ తీరును వ్యతిరేకిస్తూ రాజ్యసభ ఎంపీ నరసింహారావు ఆధ్వర్యంలో విశాఖలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట బీజేపీ నేతలు నిరసనలు చేపట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైల్వే జోన్ ప్రకటించడంతో పాటు డీపీఆర్ కూడా సిద్ధం చేసిందని అయితే రాష్ట్ర ప్రభుత్వం జోన్కు కావలసిన భూమిని కేటాయించకపోగా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తూ కేంద్రంపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తోందని బీజేపీ నేతలు దుయ్యబట్టారు. రైల్వే జోన్కు భూమి కేటాయించాలని నినాదాలు చేస్తూ ర్యాలీగా బయలుదేరిన బీజేపీ నాయకులు, కార్యకర్తలను ర్యాలీకి ముందస్తు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డగించారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట, ఉద్రిక్తత చోటుచేసుకుంది. రోడ్డుపై బైఠాయించిన ఆందోళన కారులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించడంతో ఆందోళన సద్దు మణిగింది.