ప్రకాశం జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ - వీడియో వైరల్ - RTC Driver Rash Driving in Podili - RTC DRIVER RASH DRIVING IN PODILI
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 15, 2024, 12:34 PM IST
RTC Driver Rash Driving in Prakasam District : ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితమని మనం చూస్తూనే ఉంటాం. సామాన్యంగా బస్సు ఎక్కే ప్రయాణికులకు కనిపించే క్యాప్షన్ ఇది. కానీ ప్రకాశం జిల్లాలో పొదిలి ఒంగోలు మార్గంలో ఓ ఆర్టీసీ డ్రైవర్ సెల్‌ఫోన్ మాట్లాడుతూ, బస్సును ఇష్టానుసారంగా నడిపి ప్రయాణికులను భయాందోళనలకు గురిచేశాడు. ఈ ఘటన ఆగస్టు 31న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆ వీడియోలో పొదిలి డిపోకు చెందిన డ్రైవర్ ఎండీ బాజీ మస్తాన్ ఓ వైపు బస్సును నడుపుతూ మరోవైపు సెల్‌ఫోన్ వంక తదేకంగా చూస్తూ, మాట్లాడటం చేశాడు. అంతటి ఆగకుండా భారీ వర్షంలో ప్రమాదకరంగా ఫీట్లు చేస్తూ డ్రైవ్ చేశాడు. ఇది చూసి అందులోని ప్రయాణికుల భయాందోళనలకు గురయ్యారు. దీంతో వారు సెల్‌ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేయవద్దని డ్రైవర్ని కోరినా పట్టించుకోలేదు. దీంతో విసిగి వేసారి ఆయన చేష్టలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై ఆధారాలతో సహా ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆర్టీసీ డ్రైవర్లు నిబంధనలు కచ్చితంగా పాటించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.