వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసి, అన్నదాతల్ని రోడ్డున పడేసిన ఘనుడు జగన్: ఆలపాటి - Alapati Allegations on CM Jagan
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 28, 2024, 3:50 PM IST
Alapati Rajendra Prasad Allegations on CM Jagan: అబద్ధాలు, అసత్యాలు, మోసాలతో రైతుల్ని దారుణంగా వంచించిన జగన్ రెడ్డికి రైతుల పేరెత్తే అర్హత లేదని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ (Former Minister Alapati Rajendra Prasad) మండిపడ్డారు. రైతు భరోసా ముసుగులో వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేసి, అన్నదాతల్ని రోడ్డున పడేసిన ఘనుడు జగన్ రెడ్డి అని దుయ్యబట్టారు. పోలవరం పూర్తి చేయలేని అసమర్థుడు రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్, గిట్టుబాటు ధర, ఎరువులు, విత్తనాలు ఇవ్వలేనివాడు రైతుల పక్షపాతా అని నిలదీశారు. ఒక్కో రైతుపై 2 లక్షలు అప్పు భారం వేయడమే జగన్ రైతులకు చేసిన మేలని ఆలపాటి విమర్శించారు. అధికారంలోకి వచ్చాక ప్రతి రైతుకి రూ. 50 వేలు ఇస్తానన్న జగన్, కేంద్ర ప్రభుత్వ సొమ్ముతో కలిపి కేవలం రూ. 37,500 మాత్రమే ఇచ్చాడని అన్నారు.
రాష్ట్రంలో 82 లక్షలకు పైగా రైతులంటే, 52 లక్షల మందికి అరకొర సాయం అందించి వారిని మోసగించాడని మండిపడ్డారు. చంద్రబాబు ఒకేసారి 50 వేల రుణమాఫీ చేస్తే, 4 ఏళ్ల 10 నెలల పాలనలో జగన్ చచ్చీచెడి కొందరికే రూ. 37,500లు ఇచ్చాడని అన్నారు. ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా సాయం చెల్లింపుల్లో కూడా జగన్ రెడ్డి అన్నదాతల్ని వంచించాడని దుయ్యబట్టారు. యూనిట్ విద్యుత్ 1.50 పైసలకు ఇస్తానని ఆక్వారైతుల్ని మోసగించాడన్నారు. 3 వేల కోట్లతో ఏర్పాటు చేస్తానన్న ధరల స్థిరీకరణ నిధి, 4 వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఏమయ్యాయి జగన్ రెడ్డి అని ప్రశ్నించారు. 6 వేల కోట్ల ప్రజల సొమ్ము అమూల్ సంస్థకు దోచిపెట్టి, పాడి రైతుల్ని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రోడ్డున పడేశారని ఆలపాటి రాజేంద్రప్రసాద్ ధ్వజమెత్తారు.