భూములు కాజేసేందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ - 14 చట్టాలకు అది విరుద్ధంగా ఉంది: జనచైతన్య వేదిక - Flaws in Land Titling Act - FLAWS IN LAND TITLING ACT
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : May 5, 2024, 5:37 PM IST
Flaws in Land Titling Act: భూ యాజమాన్య హక్కు చట్టం, తప్పులతడకగా ఉందని హైకోర్టు న్యాయవాదులు మండిపడ్డారు. దేశంలో ఏ రాష్ట్రమూ తీసుకురాని ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలు చేసేందుకు జగన్ ఎందుకు తహతహలాడుతున్నారని ప్రశ్నించారు. భూములు కాజేసేందుకు తెచ్చారే తప్ప ఈ చట్టంతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని మండిపడ్డారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని వైసీపీ ప్రభుత్వం ఎవరితో చర్చలు, సంప్రదింపులు జరపకుండా తీసుకురావడం సరికాదని విశ్రాంత ఐపీఎస్ అధికారి పి. కృష్ణయ్య అన్నారు. గుంటూరులో జనచైతన్య వేదిక ఆధ్వర్వంలో భూ యాజమాన్య హక్కు చట్టం అమలు - లోపాల మీద జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న హైకోర్టు న్యాయవాదులు సుంకర రాజేంద్రప్రసాద్, నర్రా శ్రీనివాసరావు, జనచైతన్య వేదిక సంస్థ అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి... భూ యాజమాన్య హక్కు చట్టం తప్పుల తడకగా ఉందన్నారు. ప్రజల స్థిర ఆస్తులకు సంబంధించి రాష్ట్రం రూపొందించిన ఈ చట్టం కేంద్రం తెచ్చిన మోడల్ కు భిన్నంగా ఉందని పి. కృష్ణయ్య పేర్కొన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 14 చట్టాలకు విరుద్ధంగా ఉందని న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అసలైన యజమానులు నష్టపోయేవిధంగా పలు లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు.