సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంపై అనిశా దాడులు- రూ. 2.50 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారి
🎬 Watch Now: Feature Video
ACB Authorities Caught Madakasira Sub Register Taking Bribe: సత్యసాయి జిల్లా మడకశిర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ దాడులు చేసింది. 2లక్షల 50వేల రూపాయలు లంచం తీసుకుంటున్న అధికారులను అనిశా అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ అధికారి తెలిపిన వివరాల మేరకు మడకశిర మండల పరిధిలోని గంతలపల్లికి చెందిన రైతు హనుమంతరెడ్డి తన 8ఎకరాల 32సెంట్ల ఎసైన్డ్ భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని సబ్ రిజిస్ట్రార్‌ను ఆశ్రయించారు. ఎకరాకు 50 వేల రూపాయల చొప్పున ఇవ్వాలని దస్తావేజు లేఖరి షమీవుల్లా ద్వారా డిమాండ్ చేయగా రూ.2.50 లక్షలకు బేరం కుదుర్చుకున్నట్లు తెలిపారు.
డబ్బు తీసుకునే సమయంలో సబ్ రిజిస్ట్రార్ దామోదర్‌రెడ్డి, డాక్యుమెంట్ రైటర్ షమీవుల్లాని రెడ్ హ్యాండెడ్‌గా అనిశా అధికారులు పట్టుకున్నారు. ఇరువురిని అదుపులోకి తీసుకున్నట్లు అనిశా అధికారులు వెల్లడించారు. వారిపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ వెంకటాద్రి చెప్పారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రాత్రి 9.30 గంటల వరకు ఏసీబీ అధికారులు తనిఖీలు చేయడంతో ఈ విషయం బయటపడింది.