స్వర్ణరథం, గజ వాహనాలపై విహరించిన శ్రీనివాసుడు - గోవింద నామస్మరణతో మారుమోగిన తిరుగిరులు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 9, 2024, 10:08 PM IST
Srivari Brahmotsavam Celebrations at TTD : తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉదయం, రాత్రి వేళల్లో మలయప్పస్వామి పలు రకాల వాహనాలపై వివిధ రకాల వేషధారణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు బుధవారం మలయప్పస్వామి స్వర్ణరథం, గజ వాహనాలపై పయనించి భక్తులను కటాక్షించారు. ముందుగా సాయంత్రం స్వర్ణరథంపై ఆ తిరుమల వేంకటేశ్వరుడు పయనించాడు. మాడవీధులలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీవారి స్వర్ణ రథాన్ని స్వయంగా లాగారు. స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంవల్ల లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలూ కలుగుతాయని భక్తుల నమ్మకం. అలాగే భూదేవి కరుణతో సమస్తధాన్యాలూ, శ్రీవారికరుణతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయని విశ్వాసం.
అనంతరం శ్రీదేవి, భూదేవి సమేతంగా వేంకటాద్రీశుడు గజవాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. శ్రీవారిని సాక్ష్యాత్తు గజేంద్రుడు మోస్తున్నట్టు భక్తులకు దర్శనం ఇచ్చాడు. ఆలయ ప్రధాన అర్చకులు స్వామివారిని సుందరంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో జె. శ్యామలరావు దంపతులు, అదనపు ఈవో హెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.