WhatsApp Context Card Feature : ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్ వినియోగదారులందరూ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు. ఇక వాట్సాప్ గ్రూప్‌లైతే చెప్పనక్కర్లేదు. స్కూల్, కాలేజీ బ్యాచ్‌మేట్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ గ్రూప్స్ ఇలా చాలా వాట్సాప్ గ్రూపుల్లో తెలియకుండానే యాడ్ అవుతున్నారు. ఈ క్రమంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు యాడ్ చేసిన వాట్సాప్ గ్రూప్‌లో చేరి మోసపోతున్నారు. ఇలాంటి మోసాలను అరికట్టేందుకు, యూజర్లు నేరుగా గ్రూప్‌లో యాడ్ చేసిన వ్యక్తి వివరాలను తెలుసుకునేందుకు వాట్సాప్ ఓ కొత్త సేఫ్టీ ఫీచర్‌ను తీసుకొచ్చింది. అదేంటంటే?
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్ల భద్రత, సౌకర్యం కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తుంటుంది. మీ కాంటాక్ట్ లిస్ట్‌లో లేని వ్యక్తులు, లేదా అపరిచితులు మిమ్మల్ని ఇతర వాట్సాప్ గ్రూపులో యాడ్ చేసినప్పుడు, వాట్సాప్ తాజాగా తీసుకొచ్చిన ఫీచర్ కీలకంగా పనిచేస్తుంది. ముఖ్యంగా యూజర్లను వాట్సాప్ గ్రూప్ స్కామ్స్ బారిన పడకుండా కాపాడుతుంది. మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ చేసిన వ్యక్తి పేరు, కాంటెక్స్ట్, సందర్భాల గురించిన పూర్తి వివరాలు చూపిస్తుంది. ఆ గ్రూప్ ఎప్పుడు, ఎవరు క్రియేట్ చేశారు? వంటి వివరాలు అందులో ఉంటాయి.
వాటిని అరికట్టడమే లక్ష్యంగా!
గత కొన్నాళ్లుగా లక్షలాది మంది వాట్సాప్ గ్రూప్ స్కామ్స్ బారినపడుతున్నారు. వాటిని అరికట్టేందుకు వాట్సాప్ ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్ కాంటాక్ట్ లిస్ట్‌లో లేని వ్యక్తి పంపిన రిక్వెస్ట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని వాట్సాప్ తెలిపింది. అప్పుడు గ్రూప్‌లో ఉండాలా? తప్పుకోవాలా? అని యూజర్లు నిర్ణయించుకోవచ్చని పేర్కొంది.
వావ్ అనిపించే మెటా ఏఐ ఫీచర్
మార్క్ జుకర్ బర్గ్ నేతృత్వంలోని మెటా సంస్థ ఇటీవలే భారత్‌లో 'మెటా ఏఐ'ని అందుబాటులోకి తీసుకువచ్చింది. లామా-3 ఆధారంగా పని చేసే ఈ చాట్‌బాట్‌తో చిత్రాలు రూపొందించవచ్చు. మీకు నచ్చిన ఆహార పదార్థాల రెసిపీలను తెలుసుకోవచ్చు. మీ విహారయాత్రలను కూడా ప్లాన్ చేసుకోవచ్చు.