Prasar Bharati Launches OTT Platform Waves: నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు బిగ్ షాక్. ఇండియన్ గవర్నమెంట్ సొంత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చింది. భారత పబ్లిక్ బ్రాడ్‌కాస్టింగ్ దిగ్గజ సంస్థ ప్రసార భారతి 'వేవ్స్' పేరుతో దీన్ని ఆవిష్కరించింది. ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా వినియోగదారులకు కేంద్రం అద్భుతమైన అవకాశం అందిస్తుంది.
ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కి మంచి ఆదరణ లభిస్తోంది. తమకు నచ్చిన మూవీస్, కామెడీ ప్రోగ్రామ్స్‌ను చూసేందుకు ఎక్కువ మంది ఓటీటీలనే ఆశ్రయిస్తున్నారు. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, ఆహా అంటూ చాలా ఓటీటీలు ఉన్నాయి. అయితే వాటికి నెలవారీ, ఏడాది చొప్పున ఛార్జీలు చెల్లిస్తూ సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ 'వేవ్స్' ప్లాట్‌ఫామ్‌తో వినియోగదారులకు ఉచితంగా రామాయణం, మహాభారతం వంటి వాటిని ఉచితంగా అందిస్తామని ప్రసార భారతి తెలిపింది.
గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) కార్యక్రమం వేదికగా ప్రసార భారతి ఈ కొత్త స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ 'వేవ్స్'ను ఆవిష్కరించింది. బుధవారం గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఈ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించారు. ఈ ఓటీటీ ద్వారా రామాయణం, మాహాభారతంతో పాటు రేడియో ప్రోగ్రామ్స్, భక్తి పాటలు, గేమ్స్, ఇ-బుక్స్ వంటివి సైతం ఉచితంగానే అందిస్తామని ప్రసార భారతి ప్రకటించింది. ఈ ప్రభుత్వ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
వీడియో గేమింగ్, వినోదరంగానికి భారత్ గమ్యస్థానం కావాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ ప్రజా ప్రసారాల సంస్థ ప్రసార భారతి ఈ సొంత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందించగలిగే కార్యక్రమాలను అందజేయడానికి ప్రయత్నిస్తున్నామని గోవాలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రసార భారతి ఛైర్మన్ నవనీత్ కుమార్ సెహగల్ తెలిపారు.
ప్రసార భారతి తెలిపిన వివరాల ప్రకారం.. "ప్రస్తుతం 'వేవ్స్' ఓటీటీలో 65 లైవ్ ఛానెల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో 12 కంటే ఎక్కువ భాషల్లో 10కిపైగా కేటగిరీల్లో విభిన్నమైన కంటెంట్ పొందొచ్చు. వీటిలోనే వీడియో ఆన్ డిమాండ్ కంటెంట్, ఫ్రీ గేమింగ్, రేడియో స్ట్రీమింగ్ సైతం ఉంటాయి. ఇతర స్ట్రీమింగ్ సర్వీసులకు భిన్నంగా ఉండేలా ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) సాయంతో ఈ వేవ్స్ ఓటీటీని రూపొందించారు. పెద్ద వారి కోసం అలనాటి చిత్రాలు, మదురమైన పాటలు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు పిల్లల కోసం వినోద కార్యక్రమాలైన ఛోటా భీమ్, అక్బర్ బీర్బల్, తెనాలిరామ్ వంటి యానిమేటెడ్ సినిమాలు సైతం అందుబాటులో ఉన్నాయి."
యూపీఐ యూజర్లకు గుడ్‌న్యూస్- ఇకపై విదేశాల్లోనూ 'పేటీఎం కరో'!
'అంతర్గతంగా వివాదాస్పద విధానాలు పాటించిన గూగుల్- మెసేజ్‌లను మాయం చేయడమే వ్యూహం'