Mylswamy Annadurai Interview : ఒకప్పుడు నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు అనేవి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), నాసా వంటి సంస్థలకు ప్రత్యేకమైన శాస్త్రీయ అంశాలు. 21వ శాతాబ్దం ముందు వరకు అంతరిక్ష పరిశోధనలు ఒక వ్యాపార రంగంగా పెద్దగా కనిపించలేదు. అయితే ఇటీవల కాలంలో అంతరిక్ష పరిశోధనల్లో సాధించిన విజయాలు, ప్రైవేటు సంస్థల ఆగమనం వల్ల, ఈ రంగంపై వివిధ దేశాల ఆలోచన విధానంలో సమూల మార్పులు వచ్చాయి. దాంతో చాలా దేశాలు అంతరిక్ష రంగంపై దృష్టి సారించి, అందుకు అనుగుణంగా విధివిధానాలు రూపొందిస్తున్నాయి.
ఈ ప్రభావం భారత్‌పైన కూడా పడింది. అందులో భాగంగా అంతరిక్ష పరిశోధనలోని కొన్ని విభాగాల్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టబడుల (FDI)ను ప్రభుత్వం అనుమతించింది. అంతేకాకుండా భారత మార్కెట్లోకి రావడానికి ప్రవేశ మార్గాలను సరళీకరించడం, ఇండియన్ స్పేస్ కంపెనీల్లో పెట్టుబడులే లక్ష్యంగా భారత ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో అంతరిక్ష రంగంపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం, ఈ రంగంలో యువతకు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి అనే అంశాలపై 'ఈటీవీ భారత్'తో ప్రత్యేకంగా మాట్లాడారు 'మూన్ మ్యాన్ ఆఫ్ ఇండియా' డాక్టర్ మైల్స్వామి అన్నాదురై.
'ఈటీవీ భారత్'తో 'మూన్ మ్యాన్ ఆఫ్ ఇండియా' డాక్టర్ మైల్స్వామి అన్నాదురై ముఖాముఖి :
అంతరిక్ష పరిశోధనల్లోని కొన్ని విభాగాల్లో 100 శాతం విదేశీ పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఇది ఈ రంగంపై ఎలాంటి సానుకూల మార్పులను తీసుకువస్తుందని మీరు అనుకుంటున్నారు?
కొవిడ్ సమయంలో కూడా ఏ రంగమైనా పురోగతి సాధించిందంటే, అది అంతరిక్ష రంగమే. గత 65 ఏళ్లలో ప్రయోగించిన ఉపగ్రహాల సంఖ్యలో 40 శాతానికి పైగా కొవిడ్ తర్వాత మూడేళ్లలో ప్రయోగించినవే. ప్రధానంగా 90 శాతానికి పైగా ఉపగ్రహాలను ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్, వన్ వెబ్ వంటి ప్రైవేట్ సంస్థలు రోదసిలోకి పంపించాయి.
ఇక భారత్ విషయానికొస్తే, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అంతరిక్ష రంగంలో అనేక ప్రగతిశీల పరిశోధనలు జరుగుతున్నాయి. చంద్రుడు, అంగారకుడిపైకి అంతరిక్ష నౌకలను పంపుతున్నాం. మనకు అవసరమైన అనేక ఉపగ్రహాలను తయారు చేశాం. అయితే ఈ రంగంలో విదేశీ పెట్టుబడులకు అనుమతించడం వాణిజ్యపరంగా పురోగతిని ఇస్తాయని నేను విశ్వసిస్తున్నాను. ప్రస్తుతం భారత్‌కన్నా కొన్ని దేశాలు ముందు ఉన్నాయి. అయితే భారత్ మాత్రం వెనకడుగు వేయదు. విదేశీ పెట్టుబడుల వల్ల మెరుగైన పనితీరుకు ఆస్కారం ఉంది. తమిళనాడులోని కులశేఖరన్ పట్టినంలో లాంచ్ ప్యాడ్‌ను ఏర్పాటు కానుంది. పెట్టుబడులు అందుబాటులో ఉన్నప్పుడు అంతరిక్ష పరిశోధనల్లో భారతీయులు మరింత ముందుకు వెళతారని నా నమ్మకం.
అంతరిక్ష పరిశోధన కేవలం సైన్స్‌కే పరిమితం కాదు. మిలిటరీ ఉపగ్రహాల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుంటే అందులో జాతీయ భద్రత ఉంటుంది. ఈ క్రమంలో ప్రభుత్వ జోక్యం లేకుండా విదేశీ పెట్టుబడులను అనుమతించడం సాధ్యమేనని మీరు భావిస్తున్నారా?
ఇది సవాలుతో కూడుకున్న పని. దాదాపు సెల్ఫోన్ల మాదరిగానే భద్రత, వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగపడతాయి. ఈ జాబితాలో డ్రోన్లు కూడా ఉన్నాయి. అందువల్ల ఈ రంగాన్ని ప్రభుత్వం నియంత్రించాల్సిన అవసరం ఉంది.
భారత్‌లో అంతరిక్ష రంగం భారీ పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంది. కొత్త కెరీర్ అవకాశాలను కూడా అందిస్తున్నాయి. విద్యార్థులు ఈ రంగాన్ని ఎలా చేరుకోవాలి? అందులో తమ కెరీర్‌ను మలచుకోవడానికి వారు ఏలాంటి కోర్సులు చేయొచ్చు?
బీటెక్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్‌లు చేసిన వారికి అవకాశాలున్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో ఏరోనాటికల్, ఏరో స్పేస్ వంటి కోర్సులను ఎంచుకోవచ్చు. తిరువనంతపురంలోని ఇస్రోకు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకునే అవకాశం లభించిన వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. కోర్సు పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వ లేదా ప్రైవేట్ స్పేస్ సెక్టార్‌లో ఉద్యోగం పొందవచ్చు. అందులో మంచి పనితీరు కనబరిస్తే నాసా అకాడమీలో చదువుకునే అవకాశాలు కల్పిస్తారు.
మానవులను అంతరిక్షంలోకి పంపే గగన్‌యాన్ ప్రాజెక్ట్ స్టేటస్ ఏమిటి?
గగన్‌యాన్ ప్రాజెక్టు చివరి దశలో క్రయోజెనిక్ యంత్రాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. లాంచ్ వెహికల్ ప్రయాణంలో ఉన్నప్పుడు బాహ్య ఉష్ణోగ్రతలో మార్పులు లేదా ఇంధనంలో చిన్న మార్పుల వల్ల మిషన్‌కు అంతరాయం కలగకూడదు. ఈ సమస్య, అందులో ప్రయాణించే వారి భద్రతకు ముప్పుగా మారకుండా జాగ్రత్తపడుతున్నాం. అందుకే క్రయోజనిక్పై 30కి పైగా ప్రయోగాలు చేశాం. చివరి దశ పరీక్షల్లో క్రయోజనిక్ ఇంజిన్ మనుషులను మోసుకెళ్లే అర్హత సాధించింది. ఇంతకుముందు నిర్వహించినట్లు వేరు వేరుగా కాకుండా, అన్నింటికీ కలిపి ఒకేసారి పరీక్షలు నిర్వహిస్తేనే తుది నిర్ధరణకు రావచ్చు. ఈ ఏడాది చివరిలో వ్యోమ్మిత్ర అనే హ్యూమనాయిడ్ రోబోను మానవ రహిత అంతరిక్ష నౌకలో పరీక్షలకు పంపనున్నారు. తద్వారా గాలి పీడనం, ఉష్ణోగ్రత మొదలైనవి మనుషులపై ఎలాంటి ప్రభావం చూపుతాయి అనే విషయాలను వ్యోమనౌకలోని రోబో అంచనా వేస్తుంది. ఆ ఫలితాల ఆధారంగా మనుషులను నింగిలోకి పంపుతారు.
అంతరిక్ష పరిశ్రమలో కృత్రిమ మేధ వినియోగంపై మీ అభిప్రాయాలు ఏమిటి?
కంప్యూటర్లు, సెల్ ఫోన్లు వంటి సాంకేతికతలు మొదట అంతరిక్ష పరిశ్రమకు అందుబాటులోకి వచ్చాయి. ఆ తర్వాతే అవి వాణిజ్యపరంగా లాభసాటిగా మారాయి. మంగళయాన్‌ను ప్రయోగించినప్పటి నుంచి ఇస్రో ఏఐ వినియోగిస్తోంది. చంద్రయాన్ ప్రాజెక్ట్‌లో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లను ఆటోమేటిక్‌గా ఆపరేట్ చేయడానికి ఏఐని ఉపయోగించారు. ప్రస్తుతం ఉపగ్రహాల్లో చిన్న చిన్న యంత్రాలన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో అనే విషయాలు తెలుసుకోవడానికి ఏఐని ఉపయోగిస్తున్నారు. క్రయోజెనిక్స్ వంటి పరికరాలను పరీక్షించినప్పుడు వచ్చే డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఏఐ ఉపయోగిస్తున్నారు. కక్ష్యలో తిరుగుతున్న ఉపగ్రహాల మిషన్లను పర్యవేక్షించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్నారు. భవిష్యత్‌లో ప్రపంచానికి అవసరమైన సాంకేతికతను ఈరోజు ఉపయోగించడంలో అంతరిక్ష రంగం ముందుంది.
గ్లోబల్ వార్మింగ్ ఒక ప్రధాన సమస్యగా మారుతోంది. సూర్యుడిని అన్వేషించడానికి ఉద్దేశించిన ఆదిత్య-ఎల్1 మిషన్ పంపిన డేటా వాతావరణ మార్పులను పరిష్కరించడంలో మనకు సహాయపడుతుందా?
ఆదిత్య ఎల్1 మిషన్ భూమిపై కాకుండా అంతరిక్షంలో జరిగే మార్పులను గమనిస్తుంది. ఇటీవల ప్రయోగించిన INSAT 3DS ఉపగ్రహం భూమి ఉష్ణోగ్రతను పరిశీలిస్తుంది. 1.5 బిలియన్ డాలర్ల వ్యయంతో తయారు చేసిన ఎన్ఐఎస్ఆర్ (నాసా ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్) ఉపగ్రహాన్ని మరికొద్ది వారాల్లో ప్రయోగించనున్నారు. ఈ ఉపగ్రహాన్ని ఇస్రో, నాసా(భారత్, అమెరికా ) సంయుక్తంగా రూపొందించాయి. ప్రతి 14 రోజులకు ఒకసారి భూమి వాతావరణ పరిస్థితుల డేటాను ఈ ఉపగ్రహం నమోదు చేస్తుంది. భూతాపం ఎంత తీవ్రంగా ప్రభావం చూపుతుందో అనే విషయం అర్థం చేసుకోవడానికి ప్రపంచ దేశాలకు ఇది మంచి అవకాశంగా నేను భావిస్తున్నా.
కంటెంట్ క్రియేటర్ల కోసం 7 బెస్ట్ ఏఐ టూల్స్ - ట్రై చేయండి!
చాట్‌జీపీటీకి పోటీగా రిలయన్స్ 'హనుమాన్' ఏఐ మోడల్- లాంఛ్ ఎప్పుడంటే?