Google Chrome 'Listen to this page' Features : ప్రముఖ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ తన క్రోమ్ బ్రౌజర్‌లో (Google chrome) ఓ సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. అదే ‘లిజన్ టు దిస్ పేజ్’ (Listen to this page) ఫీచర్. దీనిని ప్రత్యేకంగా ఆండ్రాయిడ్ యూజర్ల కోసం తెచ్చింది. దీనిని ఉపయోగించి వెబ్ పేజీలోని టెక్ట్స్‌ను ఆడియోలాగా వినివచ్చు. అంటే ఇకపై టెక్ట్స్ రూపంలో ఉన్న మ్యాటర్‌ను కష్టపడి చదవాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈ ఫీచర్ కొంత మంది యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. త్వరలో మిగతా యూజర్లకు కూడా రోల్అవుట్ కానుంది.
12 భాషల్లో
గూగుల్ తీసుకొచ్చిన ఈ స్పెషల్ ఫీచర్ ప్రస్తుతానికి 12 భాషలకు సపోర్ట్ చేస్తోంది. కనుక యూజర్లు హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్‌తోపాటు అరబిక్, చైనీస్, ఫ్రెంచ్, జర్మన్, ఇండోనేసియన్, జపనీస్, పోర్చ్‌గీస్, రష్యన్, స్పానిష్ భాషల్లో ఆడియోను వినవచ్చు. స్కీన్ లాక్ చేసి ఉన్నప్పటికీ ఆయా భాషల్లో ఆడియో వినడానికి వీలవుతుంది. అంతేకాదు ఒక వెబ్ పేజ్‌లో ఆడియో వింటూనే, మరొక వెబ్ పేజ్‌ను మనం యాక్సెస్ చేసుకోవచ్చు. పెద్ద పెద్ద వ్యాసాలు, కఠినమైన వాక్యాలు చదువుకోవడానికి ఈ ఫీచర్ చాలా బాగా ఉపయోగపడనుంది. అయితే ప్రస్తుతానికి ఈ ఫీచర్ అన్ని వెబ్ పేజీలకు సపోర్ట్ చేయడం లేదు. కానీ సపోర్ట్ చేసే పేజీలకు ప్లేబ్యాక్ సదుపాయం మాత్రం కనిపిస్తోంది.
ఎలా వాడాలి?
ఈ ఫీచర్ ఉపయోగించాలంటే, మీకు కావాల్సిన వెబ్ పేజీని ఓపెన్ చేసి, పైన కుడివైపు ఉండే త్రీడాట్స్ మెనూ ఓపెన్ చేయాలి. అక్కడ కనిపించే ‘లిజన్ టు దిస్ పేజ్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. వెంటనే పాడ్‌కాస్ట్‌లాగా వాయిస్ ప్రారంభం అవుతుంది. మ్యూజిక్ ప్లేయర్ తరహాలో దీనిని మీరు పాజ్, రివైండ్, ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోవచ్చని గూగుల్ చెబుతోంది. అంతేకాదు వేగంగా వినాలనుకుంటే, ప్లే బ్యాక్ స్పీడ్‌ను కూడా మార్చుకోవచ్చు. దీనిలో రూబీ, రివర్, ఫీల్డ్, మోస్ అనే నాలుగు రకాల వాయిస్ టైప్స్ ఉంటాయి. అందులో మీకు నచ్చిన దాన్ని ఎంచుకొని హాయిగా ఆడియో వినవచ్చు.