Apple Expands Repair Options : ఐఫోన్‌ను చాలా మంది స్టేటస్ సింబల్‌గా భావిస్తుంటారు. అంతేగాక ఐఫోన్ చాలా సెక్యూర్‌గా ఉంటుందని కూడా చెబుతుంటారు. అయితే ఐఫోన్ పార్ట్స్‌ను రిపేర్ అయిన మరో ఫోన్‌లో వాడేందుకు అనుమతి లేదు. ఇక నుంచి అందుకు అవకాశం ఇవ్వనున్నట్లు యాపిల్ సంస్థ పేర్కొంది.
ఐఫోన్ రిపేర్ ప్రక్రియను ఎట్టకేలకు యాపిల్ సులభతరం చేయనుంది. పాత ఫోన్లలోని విడి భాగాలతో రిపేర్లు చేసుకునేందుకు త్వరలో అనుమతించనున్నట్లు వెల్లడించింది. వీటి వాడకం వల్ల రిపేర్ చేసిన ఫోన్ల పనితీరుపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపింది. అయితే, ఈ మార్పును కొన్ని మోడళ్లకు మాత్రమే అనుమతించనుంది. అవేంటనేది మాత్రం యాపిల్ ఇంకా వెల్లడించలేదు.
ప్రస్తుతం ఐఫోన్‌ను రిపేర్ చేయాలంటే పార్ట్స్ పెయిరింగ్ అనే ప్రక్రియను అవలంబించాల్సి ఉంటుంది. అంటే డివైజ్ సీరియల్ నంబరుతో యాపిల్ విక్రయించిన కొత్త విడిభాగానికి కేటాయించిన ప్రత్యేక సంఖ్య సరిపోలడం ముఖ్యం. అలాకాకుండా వాడిన పాత ఫోన్ నుంచి తీసుకున్న లేదా మార్కెట్‌లో దొరికిన పార్ట్‌ను అమర్చితే, కొత్తగా ఇన్‌స్టాల్ చేసిన పరికరాన్ని ధ్రువీకరించలేకపోతున్నామని నోటిఫికేషన్లు వస్తాయి. ఫేస్‌ఐడీ, టచ్‌ఐడీ వంటి సెన్సార్లయితే పూర్తిగా పని చేయవు. కొత్తగా తీసుకురానున్న విధానంతో ఈ గొడవ ఉండదు. పాత డివైజ్ నుంచి తీసుకున్న పరికరాలను రిపేర్‌కు గురైన ఫోన్‌లో అమర్చితే దానికదే ధ్రువీకరించుకుంటుందని ఐఫోన్ కంపెనీ వెల్లడించింది. అలాగే కొత్త భాగాలను కొనుగోలు చేసేటప్పుడు యూజర్లు, రిపేర్ షాప్‌వాళ్లు ఇకపై ఫోన్ సీరియల్ నంబర్‌ను ఇవ్వాల్సిన అవసరం ఉండదు. డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫేస్‌ఐడీ, టచ్‌ఐడీ వీటన్నింటికీ ఈ మార్పు వర్తించనుంది.
యాక్టివేషన్ లాక్ ఫీచర్‌ను ఐఫోన్ పార్ట్స్‌కు సైతం విస్తరించనున్నట్లు పేర్కొంది. తద్వారా దొంగతనానికి గురైన ఫోన్లలోని విడి భాగాలను వాడితే అవి పనిచేయవు. రిపేర్ చేస్తున్న ఫోన్‌లో యాక్టివేషన్ లాక్ లేదా లాస్ట్ మోడ్ ఎనేబుల్ చేసిన ఫోన్‌లో పాత డివైజ్‌లోని విడిభాగాన్ని వాడితే దాని పనితీరును ఐఓఎస్ అరికడుతుంది. అప్పటికీ అలాగే వాడుతూ ఉంటే సెట్టింగ్స్‌లోని సర్వీస్ హిస్టరీలో ఆ డేటా సేవ్ అవుతుంది.
రూ.10వేల బడ్జెట్లో మంచి ఫోన్ కొనాలా? టాప్-10 మొబైల్స్ ఇవే! - Best Phones Under 10000
లాగిన్ కాకుండానే ChatGPT వాడాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి! - How To Use ChatGPT Without Login