YSRCP Regime Neglect Irrigation Plans to Complete Somasila Apron : నెల్లూరు జిల్లాకు వరం సోమశిల జలాశయం . ఇంత ప్రధానమైన ఈ జలాశయాన్ని గత ఐదేళ్లూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. వరదలకు దెబ్బతిన్న నిర్మాణాలను ఆధునీకీకరించలేదు. తాత్కాలిక పనులను గాలికి వదిలేసింది. వరదలకు ఆఫ్రాన్ దెబ్బతిని జలాశయం ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న పట్టించుకున్న పాపాన పోలేదు.
సోమశిల జలాశయం నెల్లూరు జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు, వేలాది గ్రామాలకు తాగునీరు అందిస్తుంది. గత వైఎస్సార్సీపీ పాలనలో ఈ జలాశయం పరిస్థితి అధ్వానంగా మారింది. కనీసం ఒక్క పనీ పూర్తిచేయలేదు. 2020-21 లో వరదలకు జలాశయం ముందు భాగం ఆఫ్రాన్ భారీగా దెబ్బతింది. మూడేళ్ల కిందట 100 కోట్లతో పనులకు టెండర్లు పిలిచారు. 20శాతం పనులు చేసిన గుత్తేదారు బిల్లులు రాక ఆపేశారు. జలాశయ ఆధునీకీకరణ కోసం రైతులు ఆందోళనలు చేపట్టారు. ఇంజినీరింగ్ అధికారులకు వినతిపత్రం అందచేశారు. అయినా వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్పందించలేదు. అధిక వరద వస్తే ఎలా అని రైతులు ఆందోళన చెందుతున్నారు.
"సోమశిల ప్రాజెక్ట్ పూర్తిగా డామేజ్ అయ్యింది. దీంతో ప్రాజెక్ట్‌లోకి నీరు రావడం లేదు. కాలువలు పూడికలు తీయలేదు. కాలువల్లో కంప చెట్లు పడిపోయి నీటి ప్రవాహనికి అడ్డు పడుతున్నాయి. సోమశిల ప్రాజెక్ట్ ఆఫ్రాన్ దెబ్బతిని నాలుగు సంవత్సరాలు అయ్యింది. గత ప్రభుత్వం రూ.100 కోట్లుతో టెండర్ల పిలిచిన గుత్తేదారులకు బకాయిలు చెల్లించకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం అయినా ఆఫ్రాన్ నిర్మాణం చేపట్టి, కాలువల్లో పూడికలు తీయించాలని కోరుకుంటున్నాం"_రైతులు
ఉత్తరాంధ్రపై మాటల్లోనే జగన్ ప్రేమ - అభివృద్ధిలో ఉత్త చేయే
జలాశయం పరిధిలోని కాలువల మరమ్మతులనూ గత ప్రభుత్వం గాలికి వదిలేసిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం సోమశిల జలాశయం ఆఫ్రాన్ పనులు త్వరగా పూర్తిచేయాలని కోరుతున్నారు. ఇటీవల సోమశిల జలాశయాన్ని పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు పనులను త్వరగా పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు.
"ప్రతి ప్రాజెక్ట్‌లోనూ, ప్రతి రిజర్వాయర్‌లోనూ, ప్రతి కెనాల్లోను అడుగడుగునా జగన్ మోహన్ రెడ్డి విధ్వంసం కనపడుతుంది. సోమశిల ప్రాజెక్ట్ ఆఫ్రాన్ నిర్మాణ పనులు తొందరగా మొదలుపెట్టాలి. స్థానిక నాయకుల సహకారంతో సోమశిల ఆఫ్రాన్ పనులను పూర్తి చేస్తాం"_నిమ్మల రామానాయుడు,రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి