YSRCP Office at Occupied Sites in Peddapadu : శ్రీకాకుళం జిల్లా సిక్కోలు వైఎస్సార్సీపీ కార్యాలయ నిర్మాణాలకు అనుమతులు లేవు అనుకునే లోపే ఇళ్ల స్థలాలను ఆక్రమించి కట్టేశారని బాధితులు లబోదిబోమంటున్నారు. శ్రీకాకుళం జాతీయ రహదారి పక్కన ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయం నిర్మాణ వ్యవహారంపై గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా అధికారులు చేతులెత్తేశారు. ఇప్పటికైనా కబ్జాకి గురైన భూమిపై న్యాయం చేయాలంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
అనుమతులు లేవని నోటీసులు : శ్రీకాకుళం జాతీయ రహదారిలో వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మిస్తున్నారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం పెద్దపాడు గ్రామంలోని సర్వే నెంబరు 44లో ఎకరా 50 సెంట్లు ప్రభుత్వ భూమిని 2022 సంవత్సరం మే 18వ తేదీన 33 సంవత్సరాలు లీజుకు తీసుకున్నారు. దీనికి సంబంధించి ఎకరాకు సంవత్సరానికి వెయ్యి రూపాయలు లీజుకు తీసుకున్నట్లుగా జీవోలో పేర్కొన్నారు. జాతీయ రహదారికి ఆనుకొని ఈ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటికి సమీపంలో దీని నిర్మాణ పనులు చేపట్టారు. అయితే భవన నిర్మాణానికి సంబంధించి శ్రీకాకుళం నగరపాలకసంస్థ నుంచి ఎలాంటి అనుమతులు లేవని నోటీసులు అంటించారు.
వైఎస్సార్సీపీ అక్రమ నిర్మాణాలపై బిగుస్తున్న ఉచ్చు - NOTICES TO YSRCP OFFICES
30 సెంట్ల వరకు అక్రమణ : భవనాన్ని నిర్మించేందుకు అనుమతులు లేకపోయినా పక్కనే ఉన్న ప్రైవేటు వ్యక్తుల స్థలాన్ని సైతం ఆక్రమించేసి వైఎస్సార్సీపీ కార్యాలయ భవన ప్రహరీ గోడ నిర్మించేశారు. ఇది శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయం పరిస్థితి. దీనిలో వైఎస్సార్సీపీ కార్యాలయం భవన నిర్మాణానికి నగర పాలక సంస్థ ప్రణాళిక అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేవు. ఇవి లేకుండానే భవన నిర్మాణాన్ని 90 శాతం పూర్తి చేశారు. దీనిపై ఎట్టకేలకు శ్రీకాకుళం నగరపాలకసంస్థ అధికారులు మంగళవారం ఉదయం అనుమతులు లేకుండా భవన నిర్మాణాన్ని ఎలా చేపడతారంటూ ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని వైఎస్సార్సీపీ కార్యాలయం స్తంభంపై నోటీసు అంటించారు.
ఇది ఇలా ఉండగా ఇళ్లు స్థలాలకు సంబంధించిన 30 సెంట్ల వరకు ఉన్న భూమిని సైతం ఆక్రమణ చేశారని బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ కార్యాలయానికి పక్కనే ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘానికి చెందిన లే అవుట్లు ఉన్నాయి. ఒక్కొక్కటి ఐదున్నర సెంట్లతో మూడు వందల బిట్లుగా లే అవుట్ లేసి ఖాళీ స్థలాలుగా ఉన్నాయి. ఆరు బిట్లు కలిపి సుమారు 30 సెంట్ల వరకు అక్రమించేశారు. దీనిలో రేకుల షెడ్డు నిర్మాణాలతోపాటు ప్రహరీని నిర్మించారు. వైఎస్సార్సీపీ కార్యాలయానికి ఇచ్చింది ఎకరా యాభై సెంట్లైతే దాదాపు రెండు ఎకరాలకు పైగా దీని నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది.
ఎకరికి చెప్పి కొన్నావు? : కోటబొమ్మాళికి చెందిన పదవీ విరమణ ప్రదానోపాధ్యాయుడు జీవీ రమణమూర్తి 1993లో ఐదున్నర సెంట్ల భూమని కొనుగోలు చేశారు. ఇందుకు రిజిస్ట్రేషన్ పత్రాలు సైతం తన వద్దనే ఉన్నాయి. ఈయనకు సంబంధించిన భూమిలో 40 అడుగుల వెడల్పుకు నాలుగు అడుగులు ఉంచి 36 అడుగులు కబ్జా చేసి షెడ్డు అలాగే ప్రహరి నిర్మాణం చేపట్టారని బాధితుడు వాపోతున్నాడు. 30 సంవత్సరాలకు పైగా భూమిని కాపాడుకుంటూ వస్తున్నాని. తన భూమి పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిలో గతేడాది జులైలో వైఎస్సార్సీపీ కార్యాలయం నిర్మాణం పేరుతో తన స్థలం పూర్తిగా కబ్జా చేశారన్నారు.
భూమి ఆక్రమణపై బాధితుడు గతేడాది అక్టోబరు 6న స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఫిర్యాదును తహసీల్దారు అలాగే సర్వేయర్ రఘుకి ఇవ్వగా ఫిర్యాదు తీసుకోకుండా ఎకరికి చెప్పి కొన్నావు అంటూ తనపైనే వాదించారన్నారు. అనంతరం మాజీ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావును కలిస్తే అధికారులను సమస్యల చూడమని రాసిచ్చారన్నారు. రెండు సార్లు స్పందనలో ఫిర్యాదు చేశానన్నారు. అయినా పనులు అపకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.