Thotapalli Project: సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి ప్రాజెక్టు ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని లక్షా 91 వేల 221 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు నిర్మితమైంది. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 2.534 టీఎమ్సీలు కాగా ప్రధాన కాలువ, బ్రాంచ్ కాలువల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. పలుచోట్ల పంట డిస్ట్రిబ్యూటరీ, పంట కాల్వలు, కాంక్రీట్ పనులు దీర్ఘకాలంగా నిలిచిపోయాయి. పాత ఆయకట్టులో వందేళ్ల క్రితం చేపట్టిన కాల్వలూ శిథిల దశకు చేరుకున్నాయి.
దీంతో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఆధునికీకరణకు 195 కోట్ల 34 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసింది. 2018 జూన్‌లో గుత్తేదారులతో ఒప్పందం కుదరగా అదే ఏడాది నవంబర్‌లో పనులు ప్రారంభమయ్యాయి. 2019 మే వరకు 14కోట్ల రూపాలయల విలువైన 9 శాతం మేర పనులు పూర్తయ్యాయి. ఎన్నికల తర్వాత పెండింగు పనులు పూర్తి చేయాల్సిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం వాటికి తూట్లు పొడిచింది. ఐదేళ్ల వైవైఎస్సార్సీపీ హయాంలో కేవలం 40 కోట్ల రూపాయల విలువైన 23 శాతం పనులు మాత్రమే జరిగాయి.
రైతులకు సాగునీరు అందించడంలో జగన్ ప్రభుత్వం విఫలం: కొణతాల రామకృష్ణ - Konatala Ramakrishna
ఇప్పటి వరకు ఎడమ కాలువలో 37.62 కిలోమీటర్లకు గాను 10 కిలోమీటర్లు, కుడి కాలువ పరిధిలో 17.616 కిలోమీటర్లకు గాను 9.37 కిలోమీటర్ల మేర కాంక్రీటు లైనింగ్ జరిగింది. ఎడమ కాలువ పరిధిలో 8 బ్రాంచులు, కుడి కాలువ పరిధిలో 11 బ్రాంచి కాలువల పనులు జరగాల్సి ఉంది. వీటితో పాటు 267 వరకు అక్విడెక్టులు, సూపర్ పాసేజ్లు, అండర్ టన్నెళ్లు, అవుట్‌లెట్లు, డ్రాపులు, ఓటీ స్లూయిజ్‌లు నిర్మించాల్సి ఉంది. ఇప్పటికే పలుమార్లు గడువులు ముగిశాయి.
ఇప్పటి వరకు జరిగిన పనులకు సంబంధించి గుత్తేదారుకు 13 కోట్ల రూపాయల మేర బకాయిలున్నాయి. ఖరీఫ్ పూర్తయ్యాక గత డిసెంబరులో పనులు ప్రారంభం కావాల్సి ఉన్నా బకాయిలు చెల్లించాల్సి ఉండటం, ఎన్నికల నేపథ్యంలో బిల్లులు వస్తాయో రావోనన్న అనుమానంతో గుత్తేదారు పనులు కొనసాగించలేదు. జూన్, జులై నెలల్లో ఖరీఫ్‌కు సాగునీటి విడుదల కోసం పనులు నిలిపివేశారు. దీంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది
తోటపల్లి ప్రాజెక్టు ఆయకట్టు విస్తరణలో భాగంగా విజయనగరం జిల్లాలో చేపట్టిన బ్రాంచి కాలువ పనులు నిలిచిపోవడం వల్ల దాదాపు 17 వేల ఎకరాలకు సాగునీరు అందడం ప్రశ్నార్థకమైంది. చీపురుపల్లి నియోజకవర్గ రైతులకు ఖరీఫ్‌లో నీరు అందే పరిస్థితి లేకుండా పోయింది. గత సర్కారు వైఫల్యాలతో నిండా మునిగిన రైతులు కొత్త ప్రభుత్వంపై గంపెడాశలు పెట్టుకున్నారు. తగిన నిధులు కేటాయించి పెండింగ్ పనులు పూర్తిచేయాలని కోరుతున్నారు.
తోటపల్లి ప్రాజెక్టులో మిగిలిన పనులను పూర్తిచేసి ఆయకట్టు రైతులందరికీ సాగునీరు చేరుస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి హామీ ఇచ్చారు. శుక్రవారం తోటపల్లి ప్రాజెక్టు నీటిని ఆమె విడుదల చేశారు. ప్రాజెక్ట్ పరిధిలో లస్కర్ల పర్యవేక్షణ కొరవడింది. నీరు విడుదల చేసినా వారం, పది రోజుల్లో ప్రధాన కాల్వలకు గండ్లు పడిన ఘటనలు కోకొల్లలు. ఈ నేపథ్యంలో లస్కర్ల నియామకంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
నీరు ఉన్నా విడుదల చేయని అధికారులు - రైతుల్లో ఆందోళన - water not released to kc canal