YSRCP Leaders Revenge on Tribal Villagers: ఆదివాసీల గ్రామాల పట్ల వైసీపీ నేతల కక్ష సాధింపు చర్యలు మితిమీరిపోతున్నాయి. వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమానికి వెళ్లకపోతే కక్ష సాధింపు చర్యలతో వేధిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ నామినేషన్ కార్యక్రమానికి హాజరు కాలేదని ఓ ఆదివాసి గ్రామస్థులపై కక్ష సాధింపు చర్యలకు దిగారు.
సారవకోట మండలం గొర్రె బంధ పంచాయితీ శివారు జగన్నాధపురం ట్రైబల్ గ్రామం. ఈ గ్రామానికి నీటి సదుపాయం లేక చాలా ఇబ్బందులు పడ్డారు. అదే విధంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందలేదు. దీంతో గత ఏడాది గ్రామస్థులంతా కలిసి బోర్ తవ్వించుకొని విద్యుత్ కనెక్షన్ పెట్టించుకున్నారు.
అయితే ఈ నెల 25వ తేదీన ధర్మాన కృష్ణదాస్ నామినేషన్ ర్యాలీలో పాల్గొనాలని గ్రామస్థులను వైఎస్సార్సీపీ నాయకులు ఆదేశించారు. కానీ గ్రామానికి చెందిన గిరిజనులు పోడు వ్యవసాయంలో ఉండటంతో, ఆ ప్రచారానికి వెళ్లలేకపోయారు. ప్రచారానికి వెళ్తే కేవలం 200 రూపాయలు మాత్రమే వస్తుందని, కానీ ఏడాది పొడుగునా కష్టపడి సాగు చేసే చీపురు, జీడి మామిడి వంటి వ్యవసాయ పనులు పక్కన పెడితే లక్షల్లో ఆదాయానికి గండి పడుతుందని భావించారు.
మాచర్లలో నిలిచిన తాగునీరు - ట్యాంకర్ వస్తే యుద్ధ వాతావరణమే! - Water problem
దీంతో ధర్మాన కృష్ణదాస్ నామినేషన్ ర్యాలీకి గ్రామస్థులు వెళ్లలేకపోయారు. అప్పటి నుంచి గ్రామస్థులపై వైఎస్సార్సీపీ నాయకులు కక్ష పెట్టుకున్నారు. గిరిజనులు ప్రధాన సమస్య అయిన తాగునీటి కనెక్షన్ తొలగించారు. దీంతో గత రెండు రోజులుగా వారికి తాగునీటి ఇబ్బందులు మొదలయ్యాయి. గ్రామస్థులే సొంత ఖర్చులతో తాగునీటికి పెట్టుకున్న విద్యుత్తు కనెక్షన్ను సంబంధిత శాఖ సిబ్బంది పట్టుకుని వెళ్లిపోవడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ నాయకుల కక్ష సాధింపు చర్యలను గ్రామస్థులంతా నిరసన చేపట్టారు. ఆదివాసీ సంక్షేమ సంఘం ప్రతినిధి వాబయోగి దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో, ఆయన గిరిజనులతో పాటు ఉద్యమానికి సిద్ధమయ్యారు. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా ఖండించారు. ఈ విషయం తెలుసుకున్న విద్యుత్ సిబ్బంది, యుద్ధ ప్రాతిపదికన మళ్లీ కనెక్షన్ ఇచ్చారు.
"మాకు నీరు లేక ఎంతో ఇబ్బంది పడ్డాము. ఈ విషయాన్ని అధికారులకు, నాయకులకు కూడా తెలిపాము. అయితే వాళ్లు ఎవరూ కూడా పట్టించుకోలేదు. దీంతో మేమే డబ్బులు వేసుకుని బోరు వేసుకున్నాము. నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని, కనీసం సమాచారం ఇవ్వకుండా కనెక్షన్ తీసుకుని వెళ్లిపోయారు. నీరు లేక రెండు రోజులుగా ఎంతగానో ఇబ్బంది పడుతున్నాం". - గిరిజన మహిళ
నీటి కటకట - గత్యంతరం లేక మురికినీళ్లే తాగుతున్న కోడూరు వాసులు - Water Crisis in Kodur
అయితే ఇలాంటి కక్ష సాధింపు చర్యలు కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాలేదు. వైఎస్సార్సీపీ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి వెళ్లలేదనే కారణంగా ప్రకాశం జిల్లా సీ.ఎస్.పురం మండలం నల్లమడుగుల గ్రామానికి తాగునీటి సరఫరా నిలిపివేసిన ఉదంతంపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది.
అదే విధంగా అనంతపురం జిల్లా ఉరవకొండ కోట వీధిలో సొంత ఖర్చులతో బోరు వేసుకుంటున్న కాలనీ వాసులను వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. ప్రజలు తిరగబడటంతో ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. సొంతంగా బోరు వేసుకోటానికి విరాళాలు పోగు చేసుకుని బోరు వేసుకుంటుంటే అడ్డుకోవడంపై కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.