YSRCP Leaders Registered on Non bailable Case on Madanapalle Fire Accident : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె దస్త్రాల దహనం కేసు దర్యాప్తులో మరో అడుగు ముందుకు పడింది. భూ అక్రమాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్సార్సీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. పోలీసులు తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతుండటంతో వైఎస్సార్సీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు సహా ఇతరులు ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించడం వల్ల కేసు ఆసక్తికరంగా మారింది.
నాన్ బెయిలబుల్ కేసు నమోదు : అన్నమయ్య జిల్లా మదనపల్లె ఫైళ్ల దహనం కేసులో నలుగురు నిందితులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తూ ఒకటో పట్టణ పోలీసులు ఎఫ్ఐఆర్(FIR) లు నమోదు చేశారు. నిందితుల్లో మదనపల్లె వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా, పురపాలక సంస్థ వైస్ ఛైర్మన్ జింకా వెంకటాచలపతి, పెద్దిరెడ్డి ప్రధాన అనుచరులు మాధవరెడ్డి, రామకృష్ణారెడ్డి ఉన్నారు. కేసు వివరాలను పోలీసులు మదనపల్లె ఏడీజే కోర్టులో సమర్పించారు. 8 కేసులు నమోదు చేసినట్లు గతంలో కర్నూలు రేంజ్ డీఐజీ (DIG) కోయ ప్రవీణ్ ప్రకటించగా ఇప్పుడు ఈ నాలుగు కేసుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
కీలక దశకు మదనపల్లె ఫైళ్లు దహనం కేసు - వైఎస్సార్సీపీ నేతల కీలక పాత్ర - madanapalle fire accident case
కీలకమైన భూముల పత్రాలు స్వాధీనం : నిందితుల ఇళ్లల్లో పోలీసులు సోదాలు నిర్వహించగా వారి దగ్గర ఉండకూడని భూముల పత్రాలు లభించాయి. మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఇంటి నుంచి 8 దస్త్రాలు స్వాధీనం చేసుకోగా కోటి రూపాయల పైబడి భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన దస్తావేజులు ఉన్నట్లు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. వెంకటాచలపతి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న 10 దస్త్రాల్లో మదనపల్లె తహసీల్దార్ కార్యాలయంలో ఉండాల్సిన ప్రొసీడింగ్స్ దస్త్రాల జిరాక్స్ పత్రాలు ఉన్నట్లు ఎఫ్ఐఆర్లో వివరించారు. మాధవరెడ్డి నివాసంలో 59, రామకృష్ణారెడ్డి నివాసం నుంచి 124 దస్త్రాలు లభించినట్లు ఎఫ్ఐఆర్ కాపీలో పొందుపరిచారు. వీటి ఆధారంగా వీరిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. నిందితులపై ఫోర్జరీ, ప్రభుత్వ రికార్డుల ఫోర్జరీ, ఫోర్జరీ రికార్డులు దగ్గర ఉంచుకోవడం, దొంగతనం, దొంగసొత్తు ఉంచుకోవడం, సాక్ష్యాలు చెరిపివేయడం, నిందితులకు సహకరించడం తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
మదనపల్లె అగ్ని ప్రమాదం నిగ్గుతేల్చిన సిసోదియా!- ప్రభుత్వానికి కీలక నివేదిక - SISODIA REPORT
ముందస్తు బెయిల్ పిటిషన్ : వైఎస్సార్సీపీ నేతలు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముందస్తు బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. నమోదు చేసిన కేసుల వివరాలను తెలపాలని తమపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ నేతలు కోర్టు గడప తొక్కారు. వైఎస్సార్సీపీ నేతల ఇళ్లల్లో స్వాధీనం చేసుకున్న దస్త్రాలే కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది. వీటన్నింటిని పరిశీలిస్తే కుట్రకోణం బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.