YSRCP Leaders Killed BC Youth: వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్తమాధవరంలో వైసీపీ, రెవిన్యూ అధికారుల భూదాహానికి చేనేత కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మరవకముందే ఈ నెల 2వ తేదీన పెండ్లిమర్రిలో యాదవ సంఘానికి చెందిన వ్యక్తి దారుణ హత్యకు గురికావడం సంచలనంగా మారింది. మొదట అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు బాధితులు, ప్రజాసంఘాల ఒత్తిళ్ల మేరకు హత్య కేసుగా మార్చారు.
వైసీపీ నాయకులు గడ్డపారలు, రాళ్లు, కర్రలతో దాడి చేసి శ్రీనివాసులును హత్య చేసినట్లు గుర్తించారు. ఉదయం పొలానికి వెళ్లిన శ్రీనివాసులను వైసీపీ కార్యకర్తలు నాగ పుల్లారెడ్డి, రామారావు, జగన్ మోహన్ రెడ్డి, రామసుబ్బారెడ్డి, పెద్ద నాగిరెడ్డి, ధర్మారెడ్డి కలిసి హత్య చేసినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రామసుబ్బారెడ్డికి చెందిన 5 ఎకరాలను 2003లో యాదవపురానికి చెందిన చిన్న సుబ్బరాయుడు కొనుగోలు చేశాడు. ఆ భూమి రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది. ఇటీవల రీసర్వేలో ఆ భూమి 5.77 ఎకరాలు ఉన్నట్లు తేలడంతో ఆ మేరకు చిన్నసుబ్బరాయుడు పేరుతో రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసుపుస్తకాలు జారీచేశారు.
వైసీపీ శవరాజకీయం చేస్తోంది - సీఈఓ మీనాకు వర్ల రామయ్య ఫిర్యాదు - Varla Ramaiah Complaint to CEO
అయితే మిగిలిన 77 సెంట్ల భూమి తనదేనని నాగపుల్లారెడ్డి అనే వ్యక్తి చిన్న సుబ్బరాయుడు కుమారుడు ఆదిమూలపు శ్రీనివాసులుతో తరచూ గొడవకు దిగుతున్నట్లు బాధితులు తెలిపారు. ఐదేళ్ల నుంచి ఈ భూమికి సంబంధించి ఇరువురి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. వైసీపీ కార్యకర్తగా ఉన్న నాగపుల్లారెడ్డి కమలాపురం ఎమ్మెల్యే, సీఎం మేనమామ అయిన రవీంద్రనాథ్‌రెడ్డి అనుచరుడు.
స్థానికంగా పోలీసులను, రెవిన్యూ అధికారులను లోబరుచుకుని భూకబ్జాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే బాధితుడు పలుమార్లు పోలీసులను, రెవిన్యూ అధికారులను ఆశ్రయించినా ఫలితం లేదు. వివాదాస్పదమైన భూమిని సర్వే చేయించి ఎవరికి వస్తే వాళ్లు తీసుకుందామని బాధితులు చెప్పినా నిందితుడు నాగ పుల్లారెడ్డి వినడం లేదు.
ఎలాంటి పత్రాలు లేకున్నా 77 సెంట్లు తనకు రాసివ్వాలని పట్టుబడుతున్నాడు. ఇదే సందర్భంలో జనవరి 28న పెండ్లిమర్రి ఎస్.ఐ.సునీల్ కుమార్ రెడ్డిని కలిసి బాధితులు ఫిర్యాదు చేస్తే వైసీపీ నాయకుల జోలికి ఎందుకు వెళ్తున్నావని ఎదురు ప్రశ్నించినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.
గతంలో తహసీల్దార్ ఉదయ్ భాస్కర్ కూడా బాధితులకు న్యాయం చేయలేదని తెలిసింది. ఈ అంశంపై స్పందనలో మార్చి 18న జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా బాధితులు ఫిర్యాదు చేశారు. కానీ స్పందన లేదు. బాధితుల పక్షాన అధికారులు ఎవ్వరూ అండగా నిలబడలేక పోవడంతో వైసీపీ నాయకులు మరింత రెచ్చిపోయారు.
అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో ఈనెల 2న పొలంలోనే శ్రీనివాసులను రాళ్లు, గడ్డపారలు, కర్రలతో కొట్టి చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఏడుగురు నిందితులపై హత్య కేసు నమోదు చేశారు. తమకు న్యాయం చేయాలని బాధితులు సీపీఐ నాయకుల సహకారంతో జిల్లా అధికారులను కలిశారు.
ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. పోలీసులు, రెవిన్యూ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీనివాసులు హత్య విషయంలో వామపక్షాలు, ప్రజాసంఘాల పోరాటంతో జిల్లా పోలీసుశాఖ స్పందించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పెండ్లిమర్రి ఎస్.ఐ.సునీల్ కుమార్ రెడ్డిని మొదట్లో వీఆర్‌కు పంపుతూ ఎస్పీ ఆదేశాలు ఇచ్చారు.
హత్య కేసులో నిజాలు నిగ్గు తేల్చడానికి అదనపు ఎస్పీ వెంకట్రాముడు ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేశారు. ప్రాథమికంగా అందిన నివేదిక ప్రకారం ఎస్.ఐ. సునీల్ కుమార్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ డీఐజీ ఆదేశాలు జారీ చేశారు. కాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్.ఐ. సునీల్ కుమార్ రెడ్డి హత్యకేసులో నిందితుడైన నాగ పుల్లారెడ్డి ఇంట్లోనే అద్దెకు నివాసం ఉంటున్నారు.
పెండ్లిమర్రి పోలీస్ స్టేషన్‌కు ఎవరు ఎస్సైగా వచ్చినా నాగ పుల్లారెడ్డి ఇంట్లోనే అద్దెకు ఉంటున్నారని తెలుస్తోంది. పోలీసులకు అద్దె లేకుండా ఇళ్లు ఇచ్చి వారికి కావాల్సిన పనులు, సెటిల్మెంట్లు చేసుకుంటున్నట్లు నాగపుల్లారెడ్డిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి.