YSRCP leaders Irregularities in Jagananna Colony: జగనన్న కాలనీలు పేరు చెప్పి గత ప్రభుత్వంలో చేసిన దోపిడీలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. స్థల సేకరణలో వైఎస్సార్సీపీ నేతలు చేతివాటం ప్రదర్శించిన తీరు విస్మయం కలిగిస్తోంది. పట్టణాలు, గ్రామాలకు దూరంగా ఎందుకూ పనికిరాని భూముల్ని ప్రభుత్వానికి అమ్మి వైఎస్సార్సీపీ నాయకులు జేబులు నింపుకున్నారు. ఊరి బయట ఇళ్ల స్థలాలు పొందిన పేదలు, అక్కడ కనీస సదుపాయాలు లేక నిత్యం అవస్థలు పడుతున్నారు.
జగనన్న కాలనీలు అంటేనే అనేక చోట్ల అక్రమాలు, అసౌకర్యాలు. హడావుడిగా గొప్పల కోసం పెద్ద ఎత్తులో కాలనీలు కాదు ఊళ్లే నిర్మిస్తున్నామని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఊకదంపు ప్రసంగాలు చేశారు. అయితే క్షేత్ర స్థాయిలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. కాలనీల కోసం భూ సేకరణ దగ్గర నుంచీ, లబ్ధిదారుల ఎంపిక వరకూ అన్నీ అక్రమాలే. ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో ఏర్పాటు చేసిన కాలనీ వ్యవహారం కూడా ఇదే తీరుగా నడిచింది.
ఈ కాలనీ కోసం గత ప్రభుత్వం 8.5 ఎకరాలు భూములను సేకరించారు. ఈ భూములన్నీ వైఎస్సార్సీపీ నేతలకు సంబంధించినవి. ఇక్కడకు వెళ్లడానికి సరైన దారి కూడా లేదు. ఎకరా 4, 5 లక్షల రూపాయలు కూడా విలువ చేయని భూమిని 17.50 లక్షల రూపాయలతో కొనుగోలు చేశారు. భూములు కొనుగోలు సమయంలోనే లక్షల రూపాయలు గోల్‌మాల్ జరిగింది. భూములిచ్చిన రైతులు అధిక ధర పొందటంతో పాటు కొంతమంది ఈ కాలనీలో 3, 4 ప్లాట్లు కూడా పొందారు. వీటిని కూడా విక్రయించి సొమ్ము చేసుకున్నారు. దీనిపై గతం నుంచీ అనేక ఆరోపణలు వచ్చినా పట్టించుకోలేదు.
కాలనీలు కాదు ఊళ్లే నిర్మిస్తున్నామని చెప్పి లబ్ధిదారులను త్రిశంకు స్వర్గంలో నెట్టేశారు. కనీస సౌకర్యాల కల్పనను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కాలనీకి సరైన దారి లేదు. చెరువు మధ్యలో ఆక్రమించి, మట్టి దారిని నిర్మించారు. తాగునీటి సౌకర్యాలు కల్పించలేదు. అంతర్గత రోడ్లు, కాలువలు కూడా లేకపోవటం వల్ల కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ కాలనీలో తాగునీటి సౌకర్యం కల్పించి సమస్యలు పరిష్కరించాలని కొత్త ప్రభుత్వాన్ని స్థానికులు వేడుకుంటున్నారు.
కాకాణి ఇలాకాలో అక్రమ లేఅవుట్లు - అనుమతి లేకున్నా ప్లాట్ల విక్రయం - YSRCP Leaders Illegal Layouts