YSRCP Leaders Illegalities in Adudam Andhra : గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీయడానికి క్రీడాసంబరాలు ఉపయోగపడాలని, చక్కటి స్ఫూర్తి నింపేలా ఆటల పోటీలను సమర్థంగా నిర్వహించాలని 2022 జూన్ 22న 'ఆడుదాం ఆంధ్రా (Aadudam Andhra)'పై నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్ ఊదరగొట్టారు. కానీ క్షేత్రస్థాయిలో చెప్పిన దానికి చేసే దానికి నక్కకి నాగలోకానికి ఉన్నంతా తేడా కనిపిస్తోంది.
Aadudam Andhra Finals : ప్రజాధనంతో నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో అధికార వైఎస్సార్సీపీ నేతలు అరాచకంగా వ్యవహరించారు. గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకంటూ ప్రగల్బాలు పలికారు. కానీ ప్రతిభావంతులను పక్కన పెట్టి ఎవరు ఆడాలి, ఎక్కడ ఆడాలి, ఎవరిని విజేతలుగా ప్రకటించాలనే విషయాలను ఆ పార్టీ నేతలే నిర్ణయించారు. క్రీడా స్ఫూర్తి, క్రీడా నిబంధనలు లేవు. శాప్, ఇతర అధికార యంత్రాంగమంతా ప్రేక్షక పాత్ర వహించగా అధికార పార్టీ నేతలు అడ్డగోలుగా ఆడుదాం ఆంధ్రాను రాజకీయ ప్రచార కార్యక్రమంగా ఉపయోగించుకున్నారు. దాదాపు 150 కోట్ల ప్రజాధనంతో 2023 డిసెంబరు 26న ప్రారంభమైన ఆడుదాం ఆంధ్రా నేటితో ముగియనుంది.
నెల్లూరు Vs తిరుపతి 'ఆడుదాం ఆంధ్రా' పోటీల్లో చీటింగ్ - న్యాయం చేయాలంటున్న బాలికలు
Adudam Andhra in AP : ప్రారంభం నుంచే వీటి నిర్వహణలో డొల్లతనం బయటపడింది. పోటీల్లో పాల్గొనే వారి వివరాల నమోదులో పెద్దఎత్తున లోపాలు చోటుచేసుకున్నాయి. ఎవరి ఇష్టాయిష్టాలతోనూ సంబంధం లేకుండా వాలంటీర్లు సంక్షేమ పథకాల లబ్ధిదారుల పేర్లతో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. పోటీలు ప్రారంభించాక క్రీడాకారుల జాడ లేకపోవడంతో తప్పుడు రిజిస్ట్రేషన్ల బాగోతం వెలుగు చూసింది. దీంతో అప్పటికప్పుడు స్పాట్ రిజిస్ట్రేషన్లు నిర్వహించి దారినపోయే వారందరితో ఆడించి సచివాలయాల స్థాయిలో పోటీలు నిర్వహించారు. ఆ తరువాత మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో జరిగిన పోటీలను కాగితాలపైనే చూపించారు. మహిళల క్రికెట్, ఖోఖో పోటీలు ఇదే కోవకు చెందుతాయి.
నిర్వహణ, విజేతలను ప్రకటించే విషయంలో అధికార వైఎస్సార్సీపీ నేతల మితిమీరిన జోక్యంతో జిల్లా స్థాయిలో పురుషుల జట్ల మధ్య జరిగిన క్రికెట్, కబడ్డీ వంటి పోటీలు అనేక చోట్ల కొట్లాటలు, గొడవలకు దారితీశాయి. వారికి అనుకూలమైన జట్లు రాష్ట్రస్థాయి పోటీకి వెళ్లేలా అధికారులపై ఒత్తిడి తెచ్చేవారు. ఈ క్రమంలో ప్రతిభ కలిగిన క్రీడాకారులు నష్టపోయారు. విజేతలను ప్రకటించే సందర్భంలో అధికారులు తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలపై అనేక చోట్ల బాధిత క్రీడాకారులు ఆందోళనలు చేశారు. అధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోయింది. ఐఏఎస్ అధికారులు సైతం వైసీపీ నేతలు చెప్పినట్లే వ్యవహరించారు. కొన్నిసార్లు పోలీసు బందోబస్తు మధ్య పోటీలు నిర్వహించాల్సిన దుస్థితి తలెత్తింది. ఉమ్మడి కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఈ తరహా ఘటనలు చోటుచేసుకున్నాయి.
జగనన్న బలవంతపు ఆట- ఆడుదాం ఆంధ్రాలో పాల్గొనాలని హుకుం
ఈ నెల 9 నుంచి విశాఖలో ప్రారంభమైన రాష్ట్రస్థాయి పోటీల్లో అధికార వైసీపీ నేతల అండతో బరిలో దిగిన వివిధ జట్లు యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘించాయి. ఒక జట్టు తరఫున పోటీలో పాల్గొనే క్రీడాకారులు ఒకే సచివాలయం పరిధిలోని వారై ఉండాలి. కొన్ని జట్లలో వేరొక సచివాలయం పరిధిలోని క్రీడాకారులు కూడా పాల్గొనడం గొడవలకు దారి తీసింది. ఈ నెల9న ఏయూ మైదానం (AU Ground)లో నిర్వహించిన మహిళల వాలీబాల్ మ్యాచ్ సందర్భంగా విశాఖ జిల్లా జట్టులో వేర్వేరు సచివాలయాల పరిధిలోని క్రీడాకారులున్నారని ప్రత్యర్థి జట్టు అభ్యంతరం తెలిపింది. పరిశీలనలో నిజమేనని తేలినా ఉన్నతాధికారులు యథావిధిగా పోటీలు నిర్వహించారు. విశాఖ జిల్లా జట్టును తర్వాతి మ్యాచ్‌కు విజేతగా ఎంపిక చేశారు.
తిరుపతి జిల్లా ఎమ్మార్‌పల్లి-2, నెల్లూరు జిల్లా కసుమూరు బాలికల జట్ల మధ్య శుక్రవారం రాత్రి క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఎమ్మార్‌పల్లి జట్టులో ముగ్గురు మినహా మిగిలిన వారంతా ఇతర ప్రాంతాలకు చెందిన రాష్ట్రస్థాయి క్రీడాకారిణులేనని ప్రత్యర్థి జట్టు ఆరోపించింది. కానీ తిరుపతి జట్టును విజేతగా ప్రకటించారు. గుంటూరు, తిరుపతి పురుషుల జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ సందర్భంగా గుంటూరు జట్టులో 8 మంది రాష్ట్రస్థాయి క్రీడాకారులున్నారని అధికారులకు ప్రత్యర్థి జట్టు ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ గుంటూరు జట్టునే విజేతగా ప్రకటించారు. ఈ విషయంలో అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని తిరుపతి జట్టు క్రీడాకారులు ఆరోపించారు.
స్థానికత అంశంపై విశాఖ, అనకాపల్లి పురుషుల జట్ల మధ్య కబడ్డీ క్వార్టర్ ఫైనల్స్ పోటీలోనూ వివాదం చోటుచేసుకుంది. అనకాపల్లి జట్టుపై అనర్హత వేటు వేయడంతో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మైదానంలో క్రీడాకారులు నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో పోలీసులు రావాల్సి వచ్చింది. సాయంత్రం ఇరు జట్ల మధ్య మ్యాచ్ నిర్వహించగా విశాఖ జట్టు సెమీ ఫైనల్స్‌కు చేరుకుంది. కబడ్డీ, ఖోఖో పోటీలు మ్యాట్‌లపై ఆడించాల్సి ఉండగా మట్టిలోనే నిర్వహించారు. మైదానం సరిగా సిద్ధం చేయని కారణంగా గాయాలయ్యాయని క్రీడాకారులు వాపోయారు. దీంతో మహిళలకు తుది పోటీలకు మ్యాట్‌లు ఏర్పాటు చేశారు.
మొదటి మ్యాచ్‌లోనే విరిగిన బ్యాట్లు - ఇక 47 రోజులు ఆడేదెట్లా జగనన్నా?