CM Jagan bus yatra: సీఎం జగన్ ప్రచార సభలు, పర్యటనలన్నా సామాన్య ప్రజలు హడలిపోతున్నారు. నెల్లూరు, శ్రీ సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో జగన్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. సీఎం సభ కోసం ప్రజలను తరలించడంతో సామాన్య ప్రయాణికులు అవస్థలు పడ్డారు.
నెల్లూరు నగరంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటిస్తున్నారు. సాయంత్రం వైసీపీ ప్రచారంలో భాగంగా నెల్లూరులో జరిగే రోడ్డు షో, బహిరంగ సభకు అధికారులు అతిగా ఏర్పాట్లు చేశారు. ప్రధాన కూడళ్ళ వద్ద రాకపోకలకు ఇబ్బందిని కలిగిస్తూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎక్కడపడితే అక్కడ జగన్ మోహన్ రెడ్డి బోర్డులు ఏర్పాటు చేశారు. వీఆర్సీ కూడలి అంబేద్కర్ విగ్రహం చుట్టూ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిబంధనలు పాటించకుండా అడ్డగోలుగా నగరంలో బారికేడ్లు , ప్లెక్సీలు పెట్టారు. గాంధీ బొమ్మ వద్ద విజయమహల్ వైపు రోడ్డును మూసివేశారు. కనకమహల్ సెంటర్ నుంచి ఏసీ కూరగాయల మార్కెట్ కూడలి, వీఆర్సీ కూడలివరకు వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో జగన్ పర్యటిస్తున్న సందర్భంగా అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సీఎం ప్రచార సభకు ఆర్టీసీ అధికారులు బస్సులన్నీ తరలించటంతో, బస్సులు లేక ప్రయాణికులు బస్టాండ్‌లోనే పడిగాపులు కాస్తూ, అవస్థలు ఎదుర్కొన్నారు. సభకు హాజరైన వారు, ఎక్కడపడితే అక్కడ మద్యం సేవిస్తూ కనిపించారు. మండుటెండలకు సభ పెట్టడంతో నిలువ నీడ లేక ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. సీఎం ప్రసంగంలో ఎక్కడా హిందూపురం గురించి మాట్లాడకపోవటంతో నిరాశకు లోనై నెమ్మదిగా తిరుగు ముఖం పట్టారు.
మద్యనిషేధం చేయకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమా?- జగన్కు షర్మిల మూడో లేఖ - Sharmila letter to jagan
చిత్తూరు జిల్లా ఇక పలమనేరులో సీఎం జగన్ నిర్వహించిన సభ కోసం వైసీపీ శ్రేణులు భారీగా జన సమీకరణ చేశారు. బయట రాష్ట్రాల నుంచి జనాలను తరలించారు. అందుకోసం వారికి ఒక్కొక్కరికి రూ. 250 చొప్పున పంపిణీ చేశారు. ఇక సభా ప్రాంగణంలో మద్యం ఏరులై పారింది. వైసీపీ నేతలు డబ్బులు, మద్యం పంచుతున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. సభ నిర్వహణలో భాగంగా సాధారణ ప్రజలు సైతం ట్రాఫిక్ ఆంక్షలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనాలను నగరంలోకి ప్రవేశించకుండా, ఎక్కడికక్కడే బారికెడ్లు ఏర్పాటు చేశారు. బస్సు ప్రయాణికులు 3 కిలోమీటర్ల దూరంలో దిగి నగరంలోకి నడిచిరావాల్సిన పరిస్థితి ఏర్పడింది.