YSRCP Leaders Comments on Ongole Clash: టీడీపీ నాయకులు తమ పార్టీ నేతల గురించి అసభ్యకరంగా మాట్లాడటం వలనే ఘర్షణకు దారితీసిందని, గొడవలు సృష్టించి లబ్ది పొందాలనుకుంటున్నారని ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Bhaskar Reddy) పేర్కొన్నారు. ఒంగోలులో జరిగిన విలేకర్ల సమావేశంలో వైసీపీ నాయకులు సమతానగర్ ఘటనపై మాట్లాడారు.
తెలుగుదేశం పార్టీ నాయకులపై దాడిచేసిన వైసీపీ కార్యకర్తల తప్పును కప్పిపుచ్చేందుకు మూకుమ్మడిగా విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఒంగోలు, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy), సుధాకర్ బాబు, దర్శి వైసీపీ అభ్యర్థి శివప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ సునీత తదితరులు విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు.
తన కోడలు కావ్య ప్రచారంలో ఉండగా దుర్భాషలాడారని, తన కుటుంబం జోలికి వస్తే ఊరుకుంటానా అని బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. కలెక్టర్, ఎస్పీలు తాము ఫోన్లు చేసినా ఎత్తడంలేదని, అధికారులు ఎన్నికల సంఘం మెప్పుకోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ రెండు నెలలే కదా, మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమే, ఇవన్నీ తాము గుర్తుపెట్టుకుంటామని పేర్కొన్నారు. ఏ ఒక్క విషయం మర్చిపోమన్నారు. ఎన్నికలు అయిన తరువాత చూపిస్తామంటూ బాలినేని అధికారులను హెచ్చరించారు.
మరోవైపు ఒంగోలు సమతానగర్‌లో జరిగిన గొడవలో వైసీపీ కార్యకర్తల అరెస్టుకు నిరసనగా పోలీస్ స్టేషన్ వద్ద ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఆందోళన నిర్వహించారు. తన కోడలు ప్రచారానికి వెళ్తే తెలుగుదేశం సానుభూతి పరులు తమ కార్యకర్తలను బూతులు తిట్టారని, అది గొడవయ్యిందని బాలినేని తెలిపారు. తమ కార్యకర్తలపై కేసులు కట్టి వారిని అక్రమంగా అరెస్టు చేస్తున్నారని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. జరిగిన గొడవతో సంబంధం లేకపోయినా తమ కార్యకర్తల ఇళ్లకు వెళ్లి భయబ్రాంతులకు గురిచేసి పోలీసులు అరెస్టు చేశారని, ఈ విషయం తెలిసి పోలీస్ స్టేషన్‌కు వచ్చి పోలీసులను ప్రశ్నించానన్నారు.
జిల్లా కలెక్టర్, ఎస్పీలు అధికార పార్టీ వాళ్లపై కేసులు పెట్టాలని, వేధించాలని అనుకుంటున్నారా అంటూ మండిపడ్డారు. అధికార పార్టీ వాళ్లపై చర్యలు తీసుకుంటే ఎన్నికల సంఘం మెచ్చుకుంటుందని భావించి, ఇలా అక్రమ అరెస్టులు చేస్తారా అని అన్నారు. తన కోడలకు ఇంత దారుణంగా తిటితే ఊరుకుంటానా, తన కుటుంబం జోలికి వస్తే ఊరుకోనని బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం నాయకుడు దామచర్ల జనార్థన్ నన్ను బెదిరిస్తున్నారా అని బాలినేని ప్రశ్నించారు. ఎస్పీ కార్యాలయం ముందు తెలుగుదేశం వాళ్లు ధర్నా చేస్తే వారిపై కేసులు పెట్టలేదని విమర్శించారు.