YSRCP Leaders Attack on Dalits in Raptadu: రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతల అరాచకాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో స్థానిక ఎమ్మెల్యే తోపుదుర్తి అనుచరులు రెచ్చిపోయారు. ప్రసన్నాయపల్లిలోని దళిత కాలనీలో పూరిళ్లను తగలబెట్టారు. గ్రామంలోని రెవెన్యూ పరిధి 123/2బీ సర్వే నంబరులోని రెండెకరాల్లో స్థానిక దళితులు కొన్ని రోజుల కిందట పూరిపాకలు వేసుకున్నారు. ఆ భూమిపై అంతకుముందే వైసీపీ నాయకులు కన్నేసినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని రెండు రోజులుగా వైసీపీ నాయకులు తమపై ఒత్తిడి తెస్తున్నారని, తాము నిరాకరించడంతో పలుమార్లు దౌర్జన్యానికి దిగారని బాధితులు తెలిపారు. ఈ క్రమంలో బుధవారం జైభీమ్ భారత్ పార్టీ పులివెందుల అభ్యర్థి దస్తగిరి ప్రసన్నాయపల్లికి వచ్చి దళితులను పరామర్శించారు. జగన్ ప్రభుత్వం దళితులపై ఉక్కుపాదం మోపుతోందని ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి అనుచరులు, మాకు వ్యతిరేకంగా దస్తగిరిని తీసుకొస్తారా అంటూ రాత్రి 9 గంటల 30 నిమిషాల ప్రాంతంలో దళిత కాలనీపై దండెత్తారు. కర్రలు, ఇనుపరాడ్లతో దళితులపై విచక్షణరహితంగా దాడి చేసి, గుడిసెలను తగలబెట్టారు.
నడివీధిలో దళితుడిపై వైసీపీ నేతల దాడి - ఫిర్యాదు పట్టించుకోని పోలీసులు
వైసీపీ నేతల దాడిలో పలువురికి గాయాలయ్యాయి. జైభీమ్ భారత్ పార్టీ రాప్తాడు నియోజకవర్గ ఇంఛార్జి నరేశ్, కార్యకర్త విజయ్ తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరి ఆచూకీ తెలియడం లేదని బాధితులు చెబుతున్నారు. క్షతగాత్రులను అనంతపురం సర్వజనాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వైసీపీ నేతల దాడుల నుంచి తప్పించుకున్న దళితులు రాప్తాడు పోలీస్‌స్టేషన్‌కు పరుగులు తీశారు. సీఐ మునిస్వామి శ్రీకాళహస్తిలో బందోబస్తులో ఉండటంతో ఆ సమయంలో అక్కడ ఇటుకలపల్లి సీఐ నరేందర్ విధులు నిర్వహిస్తున్నారు. వైసీపీ నాయకులు తమపై దాడికి పాల్పడుతున్నారని ఫిర్యాదు చేస్తే సీఐ కనీసం పట్టించుకోలేదని, తిరిగి తమనే అసభ్యపదజాలంతో దూషించారని బాధితులు వాపోయారు.
పత్తికొండలో వైఎస్సార్సీపీ నాయకుల దౌర్జన్యాలు - ఎమ్మార్పీఎస్ నాయకుడు ఆత్మహత్యాయత్నం
"మేము భోజనాలు తిందామని కూర్చునే సమయానికి కర్రలు తీసుకుని కొట్టడానికి వచ్చారు. ఆత్మరక్షణ కోసం మేము ఒక్కో వైపు పరుగెత్తాము. మా గుడిసెలు అన్నీ కాల్చేశారు. అక్కడ మా వాహనాలు కూడా రెండు ఉండేవి, కానీ భయం వేసి అక్కడ నుంచి మేము తప్పించుకుని వచ్చాము". - బాధితుడు
"సీఐ వద్దకు మేము వెళ్లాము. చావు బతుకుల మధ్య ఉన్నాము అని చెప్తే, మీరు చనిపోండి మాకేం అవసరం అంటూ దుర్భాషలాడారు. రాప్తాడు ఎమ్మెల్యే అనుచరులు కూడా ఫోన్ చేశారు. మేము మా కోసం పోరాడటం లేదు, ప్రజల కోసం పోరాటం చేస్తున్నాము అని చెప్పాము. అయినా సరే, మద్యం తాగి వచ్చి దాడి చేసి, గుడిసెలకు నిప్పు పెట్టారు. బైక్‌లు కూడా కాల్చారు". - బాధితుడు