YSRCP LEADER IRREGULARITIES: జగనన్న కాలనీల కోసం ప్రభుత్వం భూమి తీసుకుంటుందన్న విషయం ముందే తెలుసుకొని భారీ దోపిడీకి ఈ ప్రజాప్రతినిధి తెరతీశారు. మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ ను అడ్డుపెట్టుకొని, తక్కువ ధరకు భూములు కొని, వాటిని ఎక్కువకు అమ్మి భారీగా దండుకున్నారు. లేఅవుట్లు, ల్యాండ్ కన్వర్షన్‌తోపాటు ఇతర అనుమతులకు ఎకరాకు 5లక్షలు, అనుమతుల్లేకుండా ప్లాట్ల అమ్మకానికి ఎకరాకు 10లక్షల చొప్పున ప్రత్యేక ఏజెంట్‌ను పెట్టుకొని మరీ తీసుకున్నారు.
నరసరావుపేటకు చెందిన ప్రత్యర్థి పార్టీ నేత ఒకరు 5 ఎకరాల్లో ఎలాంటి అనుమతుల్లేకుండా ఈయన నియోజకవర్గంలో లేఅవుట్ వేసి ప్లాట్లు అమ్ముకొన్నారు. అందుకోసం కోటి ముట్టజెప్పారు. అలాగే మరో నేతకు చెందిన లేఅవుట్‌కూ ఎకరాకు 5లక్షల వసూలు చేశారు. మంగళగిరికి చెందిన స్థిరాస్తి వ్యాపారి ఒకరు అయిదెకరాల్లో లేఅవుట్‌కు ముడుపులు ఇవ్వకపోవడంతో అధికారులను పంపి హద్దు రాళ్లు తీసేయించారు. ఎకరాకు 7 లక్షల చొప్పున ఆ వ్యాపారి ఇచ్చుకోక తప్పలేదు.
ఈ ప్రజాప్రతినిధి ముఖ్య అనుచరుడు ఏటా కోట్ల విలువైన బియ్యాన్ని కాకినాడ పోర్టుకు తరలిస్తున్నారు. ఒక రైస్ మిల్లు వ్యాపారి ఈయనకు ముడుపులు ముట్టజెప్పుతున్నారు. ఈయన ముఖ్య అనుచరుడు మరొకరు పేకాట శిబిరం, కోడిపందేలతో వచ్చే డబ్బుని ఈ బాబుగారి గల్లాపెట్టెలోకి చేర్చుతున్నారు. ఇంత చేస్తున్న ఆ అనుచరుడికి, జగనన్న కాలనీల్లో మట్టి తోలి చదును చేసే కోట్ల విలువైన పనులను ప్రతిఫలంగా ఇచ్చారు. ఇందులో భారీ పర్సెంటేజీ సరేసరి.
ఆ సొమ్మునూ కానిచ్చేశారు: చెరువుల పూడికతీత పనుల్ని ఇంకో అనుచరుడికి అప్పజెప్పి లబ్ధి పొందారు. అభివృద్ధి పనుల్లో 10శాతం కమీషన్లు దండుకుంటున్నారు. ఆర్థిక సంఘం నిధులతో పనులన్నింటినీ ఒకే గుత్తేదారుకు ఇచ్చి వాటా తీసుకున్నారు. పార్కుల నిర్వహణ సొమ్మునూ వదల్లేదు. వైఎస్ విగ్రహ ఏర్పాటుకు చందాలు వసూలు చేసి, ఆ సొమ్మునూ కానిచ్చేశారు. విద్యుత్తు ఉపకేంద్రాల్లో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులను ఒక్కోటి 5 లక్షలు నుంచి 7 లక్షలకు అమ్ముకున్నారీ ప్రజాప్రతినిధి.
చీకటి పనులకు అడ్డాగా: రాజకీయం మొదలు పెట్టినపుడు ఈయన ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజవర్గంలో సెంటు భూమి ఉంటే ఒట్టు. ఎమ్మెల్యే అయ్యాక పదుల ఎకరాలు కొనేశారు. నాలుగెకరాల ప్రభుత్వ పొరంబోకు భూమినీ లాగేశారు. స్థిరాస్తి వ్యాపారుల నుంచి విలువైన 40 సెంట్ల స్థలాన్ని కానుకగా అందుకున్నారు. దీని అభివృద్ధి బాధ్యతను ఒక గుత్తేదారుకు అప్పగించి, ప్రతిఫలంగా 2 కోట్ల విలువైన పనుల్ని ఇచ్చారు. ఓ గ్రామంలో సొంత పార్టీ నాయకుడి నుంచి 4 ఎకరాలు కొని, ఆ భూమి చుట్టుపక్కలున్న 15 ఎకరాలు కొనడంతో పాటు వాటికి ఆనుకుని ఉన్న రెండెకరాల అసైన్డు భూమినీ కలిపేసుకున్నారు. దాంట్లోనే వ్యవసాయ క్షేత్రాన్ని నిర్మించుకొని, చీకటి పనులకు అడ్డాగా మార్చుకున్నారు.
చూచిరాతను ప్రోత్సహిస్తూ: నియోజకవర్గంలో ప్రైవేట్ మహిళా కళాశాలను నడుపుతున్న ఒక మహిళ మాటే ఈయనకు వేదమన్నది స్థానికుల మాట. కళాశాల ఏర్పాటుకు ఆమెకు అవసరమైన అనుమతులు వేగంగా ఇప్పించారాయన. ఒకే భవనంలో పాఠశాల, మహిళా కళాశాల, వసతిగృహం నడపరాదనే నిబంధనను పక్కకు నెట్టేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని చాలామంది ఆ మహిళ నడిపే కళాశాలల్లో పరీక్షలు రాసేందుకు పోటీపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ చూచిరాతను ప్రోత్సహిస్తూ, సబ్జెక్టుకు 2 నుంచి 4 వేలు తీసుకుంటున్నారు.
అన్నీఈయన అనుచరులకే: ఓ గ్రామంలో నాణ్యమైన ముగ్గురాయి, కోళ్లదాణాకు వాడే చిప్స్ తయారీ ముడిరాయి లభిస్తుండగా, తవ్వకాల లెక్కలు చూపకుండా ఉండేలా నెలకు ఈయనకు 20 లక్షలు ఇస్తున్నారు. ఇలా ఐదేళ్లలో 10 కోట్లు దండుకున్నారు. ఈ దోపిడీపై సొంత పార్టీ నేతే హైకోర్టులో వ్యాజ్యం వేసినా, క్షేత్రస్థాయిలో తవ్వకాలు ఆగలేదు. 4 బార్ అండ్ రెస్టారెంట్లకు అనుమతులివ్వగా, అన్నీఈయన అనుచరులకే దక్కాయి. ఈ ఆదాయంలో 33 శాతం వాటా ఆయనదే.
ప్రజాప్రతినిధి పట్టుబట్టి మరీ: సీఐలు, ఎస్సైల బదిలీ వ్యవహారాలన్నీ గుంటూరులోని అనుచరుడికి అప్పజెప్పారు. సీఐ పోస్టుకు 5 నుంచి 10 లక్షలు, ఎస్సై పోస్టుకు 3 నుంచి 5 లక్షలు, తహసీల్దారు పోస్టుకు 7 లక్షలు చొప్పున వసూలు చేస్తున్నారు. క్షేత్రస్థాయి అధికారికి 2 లక్షలు, జిల్లాస్థాయి అయితే 15 లక్షలు అని బదిలీలలకు ధరలు నిర్ణయించిన ఘనుడీయన. ప్రజాప్రతినిధికి ముడుపులు ఇవ్వాల్సి ఉన్నందున తహసీల్దారు ఒకరు తీవ్ర అవినీతి, అక్రమాలకు తెరలేపారు. జిల్లా కలెక్టర్ ఆ అధికారిని బదిలీ చేయగా, ఈ ప్రజాప్రతినిధి పట్టుబట్టి మరీ మరో మండలానికి తీసుకెళ్లారు.
అక్రమ మట్టి తవ్వకాలు: మొదటి రెండేళ్లు ఆయన తమ్ముడు ప్రతి పనికి కమీషన్ వసూలు చేశారు. పారిశుద్ధ్య పనులనుసైతం తన అనుచరుల ద్వారా చేయించి, ఆ డబ్బులు అన్నకు పంపేవారు. తమ్ముడి అక్రమాలపై అధిష్ఠానానికి ఫిర్యాదులు వెళ్లడంతో పాటు అతడి పెత్తనాన్ని ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులూ అంగీకరించ లేదు. తర్వాత తమ్ముడి స్థానంలోకి వచ్చిన అల్లుడు రెండు మండలాల్లో అక్రమ మట్టి తవ్వకాలు జోరుగా సాగిస్తున్నారు. రోజుకు 150 నుంచి 200 ట్రాక్టర్ల మట్టి రవాణా అవుతోంది. అడ్డుకున్న ఒక తహసీల్దార్‌ను సెలవుపై పంపించారు. కోటిన్నరతో అల్లుడు చేపట్టిన రోడ్డు పనులు పూర్తవ్వకముందే నాణ్యతా లోపాలు బయటపడ్డాయి.
మున్సిపల్ అధికారులతో చెరువుల్లో చేపలు పట్టించి: ‘నాడు నేడు’పనులను ఈ ప్రజాప్రతినిధి అవినీతిమయం చేశారు. ఒక్కో ఇటుకకు ప్రభుత్వం గరిష్ఠ ధర 9 రూపాయలుగా నిర్ణయించగా ఈయన అనుచర గుత్తేదారు మాత్రం 4 నుంచి 5 రూపాయలు విలువ చేసే నాసిరకం ఇటుకల్ని సరఫరా చేశారు. ఇసుకను వైసీపీ ద్వితీయశ్రేణి నాయకులు బహిరంగ మార్కెట్‌లో అమ్మేసుకున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులు సహా ప్రతిదీ వారు చెప్పిన చోట, చెప్పిన ధరకు కొనుగోలు చేయించి కోట్లు దోపిడీ చేశారు. మున్సిపల్ అధికారులతో చెరువుల్లో చేపలు పట్టించి అమ్మించిన ఘనత ఈయనకే దక్కింది.
ఈయన నియోజకవర్గ కేంద్రంలోని ఓ హోటల్ ముందున్న మురుగు గుంతలో పడి యజమానితోపాటు ఇద్దరు కూలీలు గతంలో మృతిచెందారు. దాంతో కేసుల పేరుతో సదరు యజమాని కుటుంబాన్ని భయపెట్టి 10 లక్షలు తీసుకున్నారీయన. తర్వాత కూలీల కుటుంబాలకు వ్యాపారి నుంచి 5 లక్షలు ఇప్పించారు. సీఎం సహాయనిధి నుంచి బాధితులకు 5 లక్షలు చొప్పున మంజూరు చేయించారు. అయితే ఈ సొమ్ములో ఒక్కొక్కరు 2న్నర లక్షలు మాత్రమే తీసుకోవాలని, మిగతా మొత్తాన్ని యజమాని కుటుంబీకులకే తిరిగివ్వాలని ఈయన చెప్పడంతో వారు ఎదురుతిరిగారు. అప్పుడు ఈవిషయం వెలుగులోకి వచ్చింది.
నాడు అప్పులతో సతమతం - నేడు సిరులతో కళ కళ! - YSRCP Leader Irregularities