YSRCP Leader Arrested for Misbehaving with Muslim Woman: నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఓ ముస్లిం మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన వైసీపీ నేతను పోలీసులు అరెస్టు చేశారు. శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి అనుచరుడు, పురపాలక సంఘం కో-ఆప్షన్ సభ్యుడు శ్రీనివాసరెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అతడిపై ఐపీసీ సెక్షన్-341, 354(బీ), 509 కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
అసలేం జరిగిందంటే: గురువారం బడే రాత్ సందర్భంగా నమాజ్‌కు వెళ్తున్న ఓ ముస్లిం మహిళను శ్రీనివాసరెడ్డి అడ్డగించి బురఖా తొలగించి చూశాడు. దీంతో ఆమె ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో బాధితురాలి భర్త, కుమారుడు వెళ్లి శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లి ప్రశ్నించడంతో 'మమ్మల్నే ఎదురు ప్రశ్నిస్తారా' అంటూ వారిని చెప్పుతో కొట్టాడు.
ఈ విషయం బాధితుల బంధువులకు తెలియడంతో రాత్రి శ్రీనివాసరెడ్డి ఇంటిపై దాడి చేసి కారు అద్దాలు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నించారు. సుమారు 300 మందికి పైగా ఉండటంతో పోలీసులు వారిని అదుపు చేయడం కష్టమైంది.
వివేకా హత్యతో సంబంధం లేదని అవినాష్ అప్పుడే చెప్పొచ్చు కదా: షర్మిల - YS Sharmila on MP Avinash Reddy
వెంటనే వారు వైసీపీ నేతను అక్కడి నుంచి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న బాధితులు అక్కడకు చేరుకుని రహదారిపై బైఠాయించారు. బాధితులు ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్ పత్రాన్ని వారికి చూపించడంతో ధర్నా విరమించి వెనుదిరిగారు.
కాగా ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల అహంకారం, దౌర్జన్యాలు మైనారిటీ మహిళ బురఖానూ తొలగించే స్థాయికి చేరిందని మండిపడ్డారు. ప్రశ్నించిన బాధితులపైనే తిరిగి దాడి చేయడం అరాచక పాలనకు నిదర్శనమన్నారు. మత ఆచారాలను, మహిళల మనోభావాలకు గౌరవించని కౌరవ మూకను మే 13న అన్ని వర్గాలు ఏకమై తరమికొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ముస్లింలకు టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
శుక్రవారం ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం నాయకులు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జయసూర్య, నాయకుడు లింగారెడ్డి బాధితుల ఇంటికి వెళ్లి పరామర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో మైనారిటీలపై ఇలాంటి దాడులు మామూలైపోయాయని నేతలు మండిపడ్డారు.
నేను బయటకు వెళ్లాక నరికి చంపినా ఆశ్చర్యపడనక్కర్లేదు: సునీత - YS Vivekananda Reddy murder Case