YSRCP Govt Neglected Kondaveedu Fort Development: కొండవీడు కోట 1700 అడుగుల ఎత్తైన కోట. పల్నాడు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం. రాష్ట్ర విభజన తరువాత నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి సమీపంలో ఉండటంతో ఇక్కడ ఇస్కాన్ స్వర్ణదేవాలయం నిర్మిస్తే ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా ఈ ప్రాంతానికి పునర్ వైభవాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ఇందుకు యడ్లపాడు మండలం చెంఘీజ్‌ఖాన్‌పేటలో 500 కోట్లతో హంస పథకం ప్రాజెక్టు ఏర్పాటుకు, శ్రీకృష్ణుడి స్వర్ణ దేవాలయం నిర్మాణానికి ఇస్కాన్‌కు 81.03 ఎకరాల భూమిని 99 ఏళ్ల పాటు లీజుకిచ్చింది.
ఐదు దశల్లో శ్రీకృష్ణుడి స్వర్ణ దేవాలయాన్ని నిర్మించేలా ఇస్కాన్ పనులు ప్రారంభించింది. తొలి దశలో దాదాపు 18 ఎకరాల్లో హంస వాహనంపై శ్రీకృష్ణుడి స్వర్ణ దేవాలయం, రెండో దశలో 22.94 ఎకరాల్లో రామలింగేశ్వర ఆలయం, గోవు విశ్వవిద్యాలయం, గోశాలను నిర్మించాలని ప్రణాళికలు రూపొందించారు. మూడో దశలో 18.68 ఎకరాల్లో శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం, భక్తి వేదాంత ఎడ్యుకేషనల్ సెంటర్, వేదిక్ కళాశాలను, నాలుగో దశలో 18.48 ఎకరాల్లో వేంకటేశ్వర స్వామి ఆలయం, భక్తి వేదాంత ఆసుపత్రి, వృద్ధాశ్రమం, అంతర్జాతీయ పాఠశాల, అనాథాశ్రమాలను నిర్మించాలని ఇస్కాన్ భావించింది. చివరిగా ఐదో దశలో వెన్నముద్దల వేణుగోపాలస్వామి ఆలయం, భోజనశాలలు, అతిథి గృహాలను నిర్మించాల్సి ఉంది.
18 ఎకరాల స్థలంలో స్వర్ణ దేవాలయ పనులు చేపట్టిన ఇస్కాన్ సంస్థ ఆలయం చుట్టూ 108 చిన్న ఉప ఆలయాలు నిర్మించింది. కృష్ణ భగవానుడి దృశ్య మాలికను ప్రదర్శించే థియేటర్, భక్తుల వసతులకు భవనాలు, క్యాంటీన్ నిర్మాణాలు చేసింది. ప్రాంగణం మధ్యలో శ్రీకృష్ణుడి ఆలయం, ఇస్కాన్ వ్యవస్థాపకుడి ఆలయ నిర్మాణాలకు పిల్లర్లూ నిర్మించింది. ఈ ప్రాంతం మరీ లోతట్టుగా ఉండటంతో మెరక చేసేందుకు మట్టి సరఫరాతో పాటు ఇతర పనులకు ఇస్కాన్ వైఎస్సార్సీపీ సర్కారును సాయం కోరింది.
గత ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లభించకపోవడంతో పనులు ఆగిపోయాయి. చేసిన పనులన్నీ కంప చెట్ల పాలయ్యాయి. నిలబెట్టిన స్తంభాలన్నీ కూలిపోయాయి. రాజస్థాన్ నుంచి తెచ్చిన గులాబీ రంగు రాళ్లు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ దెబ్బతింటున్నాయి. ఇనుప సామగ్రి తుప్పు పట్టిపోతోంది. మొత్తంగా హంస పథకం పూర్తిగా పడకేసింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే కొండవీడుకు అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా పేరు రావడమే కాకుండా స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయనుకుంటే వైసీపీ సర్కారు తమ ఆశలపై నీళ్లు చల్లిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత పాలకుల నిర్లక్ష్యం - పోలవరం నిర్వాసితుల పాలిట శాపం - Polavaram Residents Problems