YSRCP Government Neglect Potholes on Rural Roads: గ్రామీణ ప్రాంతాల్లో రహదారులను బాగు చేయాల్సిందిపోయి గుంతల్లో పాతరేసింది జగన్ ప్రభుత్వం. రాష్ట్ర వాటా నిధులు ఇవ్వాల్సి వస్తుందన్న భయంతో ఓ పెద్ద సంస్థ అందించిన రుణాన్నీ కుదించింది. ఇలా ప్రాజెక్టు సక్రమంగా సాగకపోవడం వల్ల 200 రహదారుల పనులు వెనక్కి మళ్లాయి. ధ్వంసమైన రోడ్లపైనే ప్రయాణాలు చేస్తూ ఐదు సంవత్సరాలుగా ప్రజలు నరకం అనుభవించారు.
మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఏదైనా పెద్ద ఆర్థిక సంస్థ సాయం అందిస్తే ఏ ప్రభుత్వమైనా అందిపుచ్చుకుంటుంది. ఇచ్చిన నిధులను సద్వినియోగం చేసుకుని అదనపు రుణం కోసం ప్రయత్నిస్తుంది. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇక్కడా రివర్స్ విధానాన్నే అమలు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో గుంతలమయమై అత్యంత దారుణంగా ఉన్న రహదారుల అభివృద్ధికి ఏఐఐబీ (ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు) అందించే రూ.4,976 కోట్ల రుణాన్ని గత ప్రభుత్వమే స్వయంగా తగ్గించింది. రాష్ట్ర వాటా ఎక్కడ పెట్టాల్సి వస్తుందోనని భయపడి ఆ రుణాన్ని రూ.3,793 కోట్లకు కుదించేసి గ్రామీణ ప్రజలకు తీరని అన్యాయం చేసింది. ఈ చర్య వల్ల అనేక జిల్లాల్లో ఏఐఐబీ ప్రాజెక్టు కింద మంజూరైన రూ.223 కోట్ల విలువైన 200 రహదారుల పనులు రద్దయ్యాయి.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏఐఐబీ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా 5,026 కోట్లతో గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాజెక్టు తీసుకొచ్చారు. అంచనా వ్యయంలో 70 శాతం ఏఐఐబీ రుణం, మిగతా 30 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చేలా ఒప్పందం కుదిరింది. అప్పట్లో 4,976 కోట్ల 29 లక్షల రూపాయలతో 7,213 కిలోమీటర్ల మేర ఉన్న 3,665 రహదారుల పనులకు ఏఐఐబీ నుంచి అనుమతి లభించింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ సర్కారు ఈ ప్రాజెక్టును సర్వనాశనం చేసింది.
ప్రాజెక్టుకు రాష్ట్ర వాటా నిధులు సరిగ్గా విడుదల చేయకపోవడం వల్ల పనుల నిర్వహణపై తీవ్ర ప్రభావం పడింది. ఒప్పందం ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి ప్రాజెక్టు ముగుస్తుంది. మంజూరైన 3,665 రహదారి పనుల్లో గత ఐదేళ్లలో 1769 కోట్ల 33 లక్షల రూపాయల మేర 1492 రహదారులు మాత్రమే పూర్తయ్యాయి. వీటిలోనూ 180 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. ప్రాజెక్టు అమలుపై ఎప్పటికప్పుడు సమీక్షించిన ఏఐఐబీ నిపుణుల బృందం పనుల నిర్వహణ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చింది. రాష్ట్ర వాటా నిధులు చెల్లించకపోవడం వల్లే పనుల్లో పురోగతి లోపించిందని వెల్లడించింది.
ఏఐఐబీ సూచనలు, ఘాటైన వ్యాఖ్యలను పట్టించుకోని గత ప్రభుత్వం ఏకంగా ప్రాజెక్టు ఖర్చునే తగ్గించుకోవాలని నిర్ణయించింది. గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ ఆదేశాలకు అనుగుణంగా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు చర్యలు చేపట్టారు. ఇదే విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖపై ఇటీవల నిర్వహించిన సమీక్షలో అధికారులు చెప్పడంతో ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు గడువు మరో 5 నెలల్లో ముగియనుండగా ఏఐఐబీ తరఫున ఇవ్వాల్సిన వాటా నిధులు 3,200 కోట్లలో ఇప్పటివరకు 900 కోట్ల రూపాయలే విడులయ్యాయి. ఏఐఐబీతోపాటు ఇంజినీర్లు తీవ్రంగా ఒత్తిడి తెస్తే కానీ అనేక విడతల్లో రాష్ట్ర వాటాగా వైఎస్సార్సీపీ సర్కారు 530 కోట్లు ఇచ్చింది.
ప్రాజెక్టు గడువును పెంచెలా కూటమి ప్రయత్నం: గత ప్రభుత్వ వైఖరితో విసుగెత్తిన ఏఐఐబీ తదుపరి విడుదల చేయాల్సిన తన వాటా నిధులను నిలిపేసింది. మొదట్లో అడ్వాన్స్‌గా నిధులిచ్చిన బ్యాంకు గత సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు ఖర్చు చేశాకే తమ వాటా నిధులు ఇస్తామని షరతు పెట్టింది. మరోవైపు పెండింగులో ఉన్న 180 కోట్ల బిల్లులు చెల్లించాలంటూ గుత్తేదారులు ఒత్తిడి చేస్తున్నారు. ఏఐఐబీ ప్రాజెక్టును మరో ఏడాది పొడిగించేలా కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు ఎప్పటికప్పుడు విడుదల చేసి ప్రాజెక్టు గడువులోగా పనులు పూర్తి చేయిస్తామని హామీ ఇస్తోంది.
పట్టాలెక్కుతున్న పురోగతి- ఎన్డీయే ప్రభుత్వంతో రహదారులకు మోక్షం - Widening of National Highway 44