YSRCP Government has Not Paid Grain Dues to Farmers : రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల సమస్యలు పరిష్కరిస్తాం అన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లోనే బకాయిలు చెల్లిస్తామని చెప్పారు. గత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దిగిపోయేనాటికి రైతులకు నిర్ణీత గడువులోగా చెల్లించాల్సిన ధాన్యం బకాయిలు చెల్లించలేదు. ప్రభుత్వం మారే ముందు వరకూ కోట్లాది రూపాయలు తన అనుయాయులైన గుత్తేదారులకు చెల్లించిన జగన్ మోహన్ రెడ్డి రైతులకు మాత్రం రిక్త హస్తాలు చూపారు. దీంతో ఖరీఫ్ సీజన్ ఆరంభమైనా పెట్టుడుబలు పెట్టేందుకు డబ్బులు లేక మరోసారి అప్పులు చేసే ధైర్యం లేక అన్నదాతలు బకాయిల కోసం ఎదురుచూస్తున్నారు.
Farmers Problems in AP : రైతుల సంక్షేమానికే ప్రాధాన్యమిస్తాం. వ్యవసాయాన్ని పండుగ చేసి చూపిస్తామని, అన్నదాతలు అప్పుల ఊబిలో పడకుండా అండగా నిలుస్తాం అని ఎక్కడ సభలు, సమావేశాలు నిర్వహించినా జగన్ మోహన్ రెడ్డి ఉపన్యాసాలు ఇచ్చారు. ఐతే అవన్నీ ఉత్తమాటలేనని నిరూపితమైంది. ప్రతికూల పరిస్థితులను సైతం అధిగమించి పండించిన ధాన్యాన్ని రైతులు వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి విక్రయించారు. పంట కొనుగోలు చేసిన 21 రోజులకు నగదు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాల్సి ఉన్నా జగన్ సర్కార్ పట్టించుకోలేదు.
Jagan Cheated Farmers in AP : ఓ వైపు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. వర్షాలు కురుస్తున్నాయి. వ్యవసాయ పనులకు ఉపక్రమించేందుకు నారుమళ్లు సిద్ధం చేసుకునేందుకు ఇదే సరైన సమయం. ఉన్నదంతా రబీ పంటపై పెట్టిన రైతులకు ప్రస్తుతం చేతిలో చిల్లి గవ్వలేదు. రైతుల నుంచి కౌలుకు సాగు చేసే వారి వరకు ప్రభుత్వం నుంచి లక్షల్లో ధాన్యం బకాయిలు రావాల్సి ఉంది. బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టి గత పంటకు చేసిన అప్పులు చెల్లించినా ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు వస్తే కానీ రెండో పంటకు పెట్టుబడి పరిస్థితి కనిపించడంలేదు. మరోవైపు అటు బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారానికి కూడా వడ్డీ అంతకు అంతా పెరిగిపోతుండటంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
'మల్లె'కు కలిసిరాని మార్కెట్- వాడిపోతున్న అన్నదాతల ఆశలు - Jasmine Farmers Suffering
ఒక్క ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలోనే 145 కోట్ల రూపాయలకు పైగా ధాన్యం బకాయిలు రావాల్సి ఉంది. పెద్ద రైతులు అందరూ ఇప్పటికే వ్యవసాయ పనుల్లో నిమగ్నం కాగా చిన్న సన్నకారు రైతులు మాత్రం ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల కోసం ఎదురుచూస్తున్నారు. సకాలంలో బకాయిలు వస్తే ఖరీఫ్ సాగుకు ఉపక్రమిస్తామని అదను దాటిపోతే మళ్లీ వర్షాలకు పంట నష్టపోక తప్పదని రైతులు వాపోతున్నారు. చెల్లింపుల్లో జాప్యంతో పెట్టుబడికి తెచ్చిన అప్పులు తీరే దారి కనిపించడం లేదని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొత్త ప్రభుత్వం రైతుల ఇబ్బందులపై దృష్టి సారించి సకాలంలో బకాయిలు చెల్లించేలా చొరవ తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.